English | Telugu

మాజీ గవర్నర్ క‌న్నుమూత

జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (79) క‌న్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన న్యూఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన ఆర్టికల్ 370 రద్దు సమయంలో జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా పనిచేసి ఆయన దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. 1960వ దశకంలో మీరట్‌లో విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన సత్యపాల్ మాలిక్, ఐదు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలోనే గడిపారు.

యూపీ ఎమ్మెల్యేగా, లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా పలు ఉన్నత పదవులను ఆయన అలంకరించారు. కాంగ్రెస్, జనతాదళ్, బీజేపీ వంటి పలు పార్టీలలో పనిచేసిన అనుభవం ఆయన సొంతం. జమ్మూకశ్మీర్‌తో పాటు బీహార్, గోవా, మేఘాలయ రాష్ట్రాలకు కూడా సత్యపాల్ మాలిక్ గవర్నర్‌గా సేవలందించారు.

గవర్నర్ పదవిలో ఉన్నప్పటికీ, ప్రజా సమస్యలపై, ముఖ్యంగా రైతుల హక్కుల కోసం ఆయన తరచూ గళం విప్పేవారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను బహిరంగంగా విమర్శించి సంచలనం సృష్టించారు. తన చివరి రోజుల్లో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, సామాజిక న్యాయం, బడుగు వర్గాల సంక్షేమంపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ మార్గనిర్దేశం చేశారు.