English | Telugu

'ఉప్పెన' రీమేక్.. హీరోగా విజ‌య్ కొడుకు..?

వైష్ణ‌వ్ తేజ్, కృతి శెట్టి జంట‌గా న‌టించిన 'ఉప్పెన' చిత్రం.. విడుద‌లైన అన్నిచోట్ల వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తోంది. డెబ్యూ డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా రూపొందించిన ఈ సినిమాలో మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి ప్ర‌తినాయ‌కుడిగా ద‌ర్శ‌న‌మిచ్చారు. శేషారాయ‌ణ‌మ్ పాత్ర‌లో విజ‌య్ న‌ట‌న.. 'ఉప్పెన' హైలైట్స్ లో ఒక‌టిగా నిలిచింది. క‌ట్ చేస్తే.. ఇప్పుడీ మ్యూజికల్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ ని త‌మిళ్ లో రీమేక్ చేసేందుకు విజయ్ సేతుప‌తి స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌.

విజ‌య్ సేతుప‌తే స్వ‌యంగా నిర్మించ‌నున్న ఈ సినిమా ద్వారా అత‌ని అభిమాన న‌టుడు విజ‌య్ కి వార‌సుడైన‌ సంజ‌య్ ని హీరోగా ప‌రిచ‌యం చేయ‌బోతున్నార‌ని టాక్. ప్ర‌స్తుతం ఈ రీమేక్ కి సంబంధించి విజ‌య్, విజ‌య్ సేతుప‌తి మ‌ధ్య చ‌ర్చ‌లు సాగుతున్నాయ‌ని కోలీవుడ్ బ‌జ్. అంతేకాదు.. ఈ రీమేక్ లోనూ విజ‌య్ సేతుప‌తినే విల‌న్ గా క‌నిపించే అవ‌కాశ‌ముందంటున్నారు. మ‌రి.. 'మాస్ట‌ర్'లో విజ‌య్ కి విల‌న్ గా మెప్పించిన విజ‌య్ సేతుప‌తి.. 'ఉప్పెన' త‌మిళ రీమేక్ లో విజ‌య్ త‌న‌యుడు సంజ‌య్ కి కూడా ప్ర‌తినాయ‌కుడిగా అల‌రిస్తారేమో చూడాలి.

త్వ‌ర‌లోనే 'ఉప్పెన' త‌మిళ రీమేక్ కి సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశ‌ముంది.