English | Telugu
చిరు, పవన్, బన్నీ, చరణ్ బాటలో వరుణ్!?
Updated : Apr 7, 2022
మెగా కాంపౌండ్ లో పేరున్న కథానాయకులంతా పాన్ - ఇండియా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడేళ్ళ క్రితం మెగాస్టార్ చిరంజీవి `సైరా.. నరసింహారెడ్డి` (2019)తో పాన్ - ఇండియా ఎటెంప్ట్ చేయగా.. రీసెంట్ గా `పుష్ప - ద రైజ్`తో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, `ఆర్ ఆర్ ఆర్`తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అదే బాట పట్టారు. ఇక ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న `హరిహర వీరమల్లు`తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా త్వరలో పాన్ - ఇండియా స్టార్ గా సందడి చేయనున్నారు.
ఇదిలా ఉంటే, ఈ కాంపౌండ్ కి చెందిన ఓ యంగ్ హీరో కూడా ఇదే తీరున ముందుకు సాగనున్నాడట. అతను మరెవరో కాదు.. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్. సోనీ పిక్చర్స్ ఇండియా సంస్థ నిర్మించనున్న ఈ పాన్ - ఇండియా వెంచర్.. దసరాకి ప్రారంభం కానుందని సమాచారం. అంతేకాదు.. దేశభక్తి కథతో తెరకెక్కనున్న ఈ సినిమాలో వరుణ్ ఓ పైలట్ గా కనిపిస్తాడని అంటున్నారు. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, వరుణ్ తేజ్ తాజా చిత్రం `గని` రేపు (ఏప్రిల్ 8) రిలీజ్ కానుంది. అలాగే, విక్టరీ వెంకటేశ్ తో కలిసి వరుణ్ నటించిన `ఎఫ్ 3` మే 27న విడుదల కానుంది. మరోవైపు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేయనున్న సినిమా ఈ ఏడాదే సెట్స్ పైకి వెళ్ళబోతోందని బజ్.