English | Telugu

అప్పుడు హీరోయిన్.. ఇప్పుడు విల‌న్..!?

ఉత్త‌రాదిన అగ్ర క‌థానాయిక‌గా రాణించిన ట‌బు.. ద‌క్షిణాదిలోనూ న‌టిగా త‌న‌దైన ముద్ర‌వేసింది. మ‌రీముఖ్యంగా.. తెలుగు, త‌మిళ భాష‌ల్లో గుర్తుండిపోయే పాత్ర‌ల్లో ఆక‌ట్టుకుంది ఈ అందాల అభినేత్రి. అలా.. టబు ద‌క్షిణాది వారిని అల‌రించిన చిత్రాల్లో `కండుకొండేన్ కండుకొండేన్` ఒక‌టి. 2000లో విడుద‌లైన ఈ త‌మిళ చిత్రం తెలుగులో `ప్రియురాలు పిలిచింది` పేరుతో అనువాద‌మైంది. ఇందులో కోలీవుడ్ స్టార్ అజిత్ కి జోడీగా క‌నువిందు చేసింది ట‌బు.

క‌ట్ చేస్తే.. దాదాపు 22 ఏళ్ళ త‌రువాత అజిత్, టబు కాంబినేష‌న్ లో మ‌రో మూవీ రాబోతోంద‌ని స‌మాచారం. అంతేకాదు.. ఈ సారి అజిత్ ని వ్య‌తిరేకించే పాత్ర‌లో ట‌బు క‌నిపిస్తుంద‌ని బ‌జ్. ఆ వివ‌రాల్లోకి వెళితే.. `నేర్కొండ పార్వై`, `వ‌లిమై` చిత్రాల అనంతరం అజిత్ తో ద‌ర్శ‌కుడు హెచ్. వినోద్, ప్ర‌ముఖ నిర్మాత బోనీక‌పూర్ ముచ్చ‌ట‌గా మూడోసారి జ‌ట్టుక‌డుతున్నారు. ఇప్ప‌టికే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చిన ఈ సినిమా.. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ బాట ప‌ట్ట‌నుంది. కాగా, ఈ చిత్రంలో నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో ట‌బు క‌నిపిస్తుంద‌ని కోలీవుడ్ టాక్. మ‌రి.. అప్ప‌ట్లో అజిత్ కి హీరోయిన్ గా ఎంట‌ర్టైన్ చేసిన ట‌బు.. ఈ సారి విల‌న్ గానూ ఇంప్రెస్ చేస్తుందేమో చూడాలి. త్వ‌ర‌లోనే అజిత్ - వినోద్ - బోనీ క‌పూర్ థ‌ర్డ్ జాయింట్ వెంచ‌ర్ లో టబు ఎంట్రీపై క్లారిటీ రానున్న‌ది.

ఇదిలా ఉంటే.. `వ‌లిమై` చిత్రం త్వ‌ర‌లోనే థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌బోతోంది.