English | Telugu

విష్ణు, వరుణ్ త‌రువాత మ‌హేశ్ తో..!?

గ‌త ఏడాది ఆగ‌స్టు 11తో 60 క్ల‌బ్ లోకి చేరిన బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి.. ఈ సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ 11తో న‌టుడిగా 30 వ‌సంతాలు పూర్తిచేసుకోబోతున్నారు. ఈ ప్ర‌యాణంలో కేవ‌లం హిందీ సినిమాల‌కే ప‌రిమితం కాకుండా తమిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, మ‌రాఠీ, ఆంగ్ల భాషా చిత్రాల‌తో పాటు తెలుగులోనూ సంద‌డి చేశారు సునీల్ శెట్టి.

నిరుడు మంచు విష్ణు, కాజ‌ల్ న‌టించిన `మోస‌గాళ్ళు`లో ఏసీపీ కుమార్ గా ఓ ముఖ్య పాత్ర‌లో క‌నిపించారు సునీల్ శెట్టి. క‌ట్ చేస్తే.. త్వ‌ర‌లో వ‌రుణ్ తేజ్ న‌టించిన `గ‌ని`తో ఎంట‌ర్టైన్ చేయ‌నున్నారాయ‌న‌. మార్చి 18న విడుద‌ల కానున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో విక్ర‌మాదిత్య‌గా సంద‌డి చేయ‌నున్నారు మిస్ట‌ర్ శెట్టి.

ఇదిలా ఉంటే.. తాజాగా మ‌రో టాలీవుడ్ ప్రాజెక్ట్ కి సునీల్ శెట్టి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్ లో రానున్న కొత్త చిత్రంలో ఓ కీల‌క పాత్ర కోసం సునీల్ శెట్టిని న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం, క‌థ‌, పాత్ర, పారితోషికం న‌చ్చ‌డంతో సునీల్ శెట్టి కూడా ఈ సినిమాకి ఓకే చెప్పిన‌ట్లు బ‌జ్. త్వ‌ర‌లోనే మ‌హేశ్ - త్రివిక్ర‌మ్ థ‌ర్డ్ జాయింట్ వెంచ‌ర్ లో సునీల్ శెట్టి ఎంట్రీపై క్లారిటీ రానుంది.