English | Telugu

బన్నీ తొందరపాటు నిర్ణయం.. ఆరు కోట్ల నష్టం..?

సినిమా సినిమాకి తన మార్కెట్ రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నాడు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అల్లు అర్జున్‌‌కు మంచి పాపులారిటీ ఉంది. హిందీ ప్రేక్షకులు కూడా బన్నీ డబ్బింగ్ సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో సినిమా రిలీజ్ కాకముందే డిటిజల్ రైట్స్ రూపంలోనే.. సగం పెట్టుబడి వచ్చేస్తుండటంతో బన్నీపై నిర్మాతల నమ్మకం పెరుగుతోంది. అయితే ఒక తొందరపాటు నిర్ణయం ఆరు కోట్ల నష్టాన్ని మిగిల్చింది.

బన్నీ ప్రజంట్ వక్కంతం వంశీదర్శకత్వంలో నా పేరు సూర్య చేస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్‌లుక్, టీజర్‌ సినిమాపై ఒక్కసారిగా భారీ అంచనాలు పెంచేయడంతో.. డిజిటల్ రైట్స్‌కు భారీ గిరాకీ ఏర్పడింది. నా పేరు సూర్య డిజిటల్ రైట్స్‌ను సుమారు రూ.12 కోట్లకు కొనుగోలు చేసింది ఓ సంస్థ. ఇది టీజర్‌ విడుదలకు ముందు జరిగింది.. కానీ... టీజర్‌లో బన్నీ పర్ఫామెన్స్.. వక్కంతం టేకింగ్ కొత్తగా ఉండటంతో.. 18 కోట్లు ఇవ్వడానికి మరో సంస్థ ముందుకొచ్చిందని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు నిర్మాతలను నిరాశకు గురిచేస్తోందట.. తొందరపడి ముందుగా బేరానికి ఒకే చెప్పడం వల్ల.. అనవసరంగా 6 కోట్లను లాస్ అయ్యామని వాళ్లు తెగ బాధపడిపోతున్నారని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అల్లు అర్జున్ ఎగ్రెసివ్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తోన్న ఈ సినిమాను లగడపాటి శ్రీధర్, బన్నీ వాసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సమ్మర్‌కి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.