English | Telugu
'అయోధ్యలో అర్జునుడు'.. 'SSMB 28'కి విభిన్న టైటిల్!
Updated : Sep 26, 2022
సూపర్ స్టార్ మహేష్ బాబు తన 28వ సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమై మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ మూవీ టైటిల్ గురించి ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. సినిమా టైటిల్ విషయంలో త్రివిక్రమ్ మరోసారి 'అ' సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.
త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన గత నాలుగు చిత్రాలను పరిశీలిస్తే 'అఆ', 'అజ్ఞాతవాసి', 'అరవింద సమేత', 'అల వైకుంఠపురములో' ఇలా అన్ని టైటిల్స్ 'అ'తోనే స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు 'ssmb 28' విషయంలోనూ అదే సెంటిమెంట్ ఫాలో అవుతూ 'అయోధ్యలో అర్జునుడు' అనే ఆసక్తికరమైన టైటిల్ ని ఖరారు చేసినట్లు న్యూస్ వినిపిస్తోంది. అయోధ్య అనగానే మనకు రాముడు గుర్తొస్తాడు. కానీ రామాయణ, మహాభారతాలను కలుపుతూ 'అయోధ్యలో అర్జునుడు' అనే విభిన్న టైటిల్ పెట్టారనే వార్త ఆసక్తికరంగా మారింది.
గతంలో మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అతడు', 'ఖలేజా' సినిమాలు ఆకట్టుకున్నాయి. దాంతో వీరి కాంబినేషన్ లో వస్తున్న 'ssmb 28'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు 'అయోధ్యలో అర్జునుడు' అనే టైటిల్ ప్రచారంలోకి రావడంతో మహేష్ కోసం త్రివిక్రమ్ ఏదో భారీగానే ప్లాన్ చేశాడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.