English | Telugu

ప్రభాస్-మారుతి సినిమాలో సంజయ్ దత్!

'ఆదిపురుష్', 'సలార్', 'ప్రాజెక్ట్ k' వంటి భారీ సినిమాలలో నటిస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అనూహ్యంగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'రాజా డీలక్స్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించనున్నాడని తెలుస్తోంది.

కన్నడ ఫిల్మ్ 'కేజీఎఫ్ చాప్టర్-2'లో అధీర పాత్రలో నటించి మెప్పించిన సంజయ్ దత్ కి సౌత్ నుంచి భారీ ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రానున్న 'దళపతి 67'లో ఆఫర్ దక్కించుకున్న ఆయనకు ఇప్పుడు ప్రభాస్-మారుతి ఫిల్మ్ లో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక పవర్ ఫుల్ రోల్ కోసం సంజయ్ దత్ ని సంప్రదించగా ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం.

'బాహుబలి' తర్వాత యువ దర్శకులకు అవకాశమిచ్చిన ప్రభాస్ 'సాహో', 'రాధేశ్యామ్' రూపంలో వరుస రెండు షాక్ లు తినడంతో.. ఇప్పుడు మారుతితో సినిమా చేయడాన్ని ఆయన ఫ్యాన్స్ వ్యతిరేకిస్తున్నారు. మరి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మారుతి సంచలనం సృష్టిస్తాడేమో చూడాలి.