English | Telugu

స‌మంత‌తో క‌లిసి జీవించ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని చైతూ.. భ‌ర‌ణం చెల్లించ‌డానికి సిద్ధం!

అక్కినేని వారింటి కోడ‌లిగా నాలుగేళ్లు ఇండ‌స్ట్రీలో అమిత గౌర‌వ మ‌ర్యాదలు పొందిన స‌మంత‌, మ‌రి కొద్ది రోజుల్లోనే, ఆ ట్యాగ్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డం దాదాపు ఖాయ‌మ‌ని తెలుస్తోంది. స‌మంత‌తో క‌లిసి జీవ‌నం సాగించ‌డానికి నాగ‌చైత‌న్య స‌సేమిరా అంటున్నందునే విడాకులు అనివార్య‌మ‌వుతున్నాయ‌ని ఇండ‌స్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఇప్ప‌టికే ఆ ఇద్ద‌రూ ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేసుకున్నార‌నీ, కోర్టు త‌ర‌పున కౌన్సిలింగ్ నిర్వ‌హించిన త‌ర్వాత కూడా వారు విడిపోవ‌డానికే నిశ్చ‌యించుకున్నార‌నీ తెలుస్తోంది.

నాగార్జున‌తో వివాహానంత‌రం అమ‌ల న‌ట‌న‌కు స్వ‌స్తిచెప్పి, గృహిణి బాధ్య‌త‌ల్లోకి మారిపోయారు. బ్లూక్రాస్ అనే స్వ‌చ్ఛంద సంస్థ‌ను ప్రారంభించి, జంతు ప‌రిర‌క్ష‌కురాలిగా సేవ‌లు అందిస్తూ వ‌స్తున్నారు. నాగ‌చైత‌న్య‌తో వివాహం త‌ర్వాత స‌మంత కూడా అప్ప‌టికి ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్తిచేసి, త‌ను కూడా న‌ట‌న‌కు విరామ‌మివ్వ‌డ‌మో, స్వ‌స్తిచెప్ప‌డ‌మో జ‌రుగుతుంద‌ని చాలామంది భావించారు. పెళ్లి త‌ర్వాత త‌ను న‌టించ‌డం కొన‌సాగిస్తాన‌ని ముందుగానే స‌మంత చెప్పింది. చైతూ కూడా ఆమె కెరీర్‌కు అడ్డు త‌గ‌ల‌కూడ‌ద‌ని అనుకున్నాడు. కానీ వివాహానికి పూర్వం కంటే వివాహానంత‌రం స‌మంత మ‌రింత బోల్డ్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ రావ‌డం, సోష‌ల్ మీడియాలో అందాలు ఆర‌బోసే ఫొటోల‌ను షేర్ చేస్తుండ‌టం చాలామందిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈ విష‌యంలో ప‌లువురు ఆమె వ్య‌వ‌హార శైలిపై ట్రోల్ కూడా చేస్తూ వ‌చ్చారు.

దీనికి తోడు చైతూ పిల్ల‌లు కావాల‌ని అనుకుంటే, స‌మంత మ‌రికొంత కాలం ఆగాల‌ని అన్న‌ద‌నీ, దీనిపై ఇద్ద‌రి మ‌ధ్యా మ‌న‌స్ప‌ర్ధ‌లు నెల‌కొన్నాయ‌నేది ఇన్‌సైడ్ టాక్‌. అలాగే 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లో స‌మంత చేసిన క్యారెక్ట‌ర్ విమ‌ర్శ‌కుల ప్ర‌శంసలు పొందిన‌ప్ప‌టికీ, అక్కినేని ఖాన్‌దాన్‌కు తీవ్ర అసంతృప్తి క‌లిగించింద‌ని చెప్పుకుంటున్నారు. ఆ త‌ర‌హా బోల్డ్ క్యారెక్ట‌ర్లు ఒప్పుకోవ‌డం అవ‌స‌ర‌మా అనే చ‌ర్చ కుటుంబంలో న‌డిచింద‌ని స‌మాచారం. అక్కినేని ఇంటిపేరు లేక‌పోయినా త‌న‌కంటూ ఇండివిడ్యువాలిటీ ఉంద‌ని నిరూపించుకోవాల‌నే ఉద్దేశంతోటే త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ల నుంచి అక్కినేని పేరును స‌మంత తొల‌గించింద‌ని అనుకుంటున్నారు.

ఏదేమైనా స‌మంత‌తో క‌లిసి జీవించ‌లేన‌ని చైతూ నిర్ణ‌యించుకోవ‌డంతో విడాకులు అనివార్య‌మ‌వుతున్నాయ‌ని తెలుస్తోంది. దీని కోసం స‌మంత‌కు భ‌ర‌ణం చెల్లించ‌డానికి కూడా అత‌ను రెడీ అయ్యాడంటున్నారు. ఆ భ‌ర‌ణం విలువ ఎంత‌నేది ఇద‌మిత్థంగా తెలీక‌పోయినా, అది రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్ల మ‌ధ్య ఉంటుంద‌ని అనుకుంటున్నారు. అక్టోబ‌ర్ 7 చైతూ, స‌మంత పెళ్లిరోజు. ఆలోగా వారి విడాకుల వ్య‌వ‌హారం ఓ కొలిక్కి రావ‌చ్చు.