English | Telugu
చిరంజీవికి 'నో' చెప్పిన సల్మాన్!
Updated : Aug 17, 2021
మెగాస్టార్ చిరంజీవి మలయాళం బ్లాక్‌బస్టర్ 'లూసిఫర్' తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు. దీనికి 'హనుమాన్ జంక్షన్' ఫేమ్ మోహన్ రాజా దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఒరిజినల్‌లో మోహన్‌లాల్ చేసిన డాన్ తరహా క్యారెక్టర్‌ను చిరంజీవి చేస్తున్నారు. ఒరిజినల్‌లో మొత్తం నాలుగు కీలక పాత్రలు, ఒక స్పెషల్ రోల్ ఉన్నాయి. మెయిన్ క్యారెక్టర్స్‌ను మోహన్‌లాల్, మంజు వారియర్, వివేక్ ఓబరాయ్, టొవినో థామస్ చేయగా, స్పెషల్ రోల్‌ను ఆ సినిమా డైరెక్టర్ పృథ్వీరాజ్ స్వయంగా పోషించాడు.
హీరోకు సందర్భం వచ్చినప్పుడు సాయం చేసే క్యారెక్టర్ పృథ్వీరాజ్‌ది. తెలుగు రీమేక్‌లో ఆ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను సంప్రదించారు మేకర్స్. చిరంజీవితో సల్మాన్‌కు చక్కని సంబంధాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆయనను ఆ పాత్రకోసం అడిగారు. అయితే సల్మాన్ ఆ ఆఫర్‌ను తిరస్కరించారని ప్రచారంలోకి వచ్చింది. సినిమాలో మధ్యలో ఓసారి కనిపించే ఆ క్యారెక్టర్.. క్లైమాక్స్‌లో కీలకంగా వ్యవహరిస్తుంది. అలాంటి క్యారెక్టర్‌ను సల్మాన్ చేస్తే.. సినిమాకు బాగా ఆకర్షణను తెస్తుందనీ, హైప్ క్రియేట్ అవుతుందనీ అనుకున్నారు.
సల్మాన్ ఆ క్యారెక్టర్‌ను ఎందుకు అంగీకరించలేదనే విషయం బయటకు రాలేదు. ఇప్పటికే ఆయన బాలీవుడ్‌లో తన సినిమాలతో బాగా బిజీగా ఉన్నందునే 'లూసిఫర్' రీమేక్‌కు డేట్స్ ఇవ్వకపోయుండొచ్చని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఆ పాత్రను ఎవరు చేస్తారో చూడాలి. కాగా ఒరిజినల్‌లో టొవినో థామస్ చేసిన పాత్రను తెలుగులో సత్యదేవ్ చేయనున్నట్లు వినిపిస్తోంది.