English | Telugu

మహేశ్‌కు "మెగా"భజన..?

సూపర్‌స్టార్ కృష్ణ నటవారసుడిగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి.. తన మార్క్ యాక్టింగ్‌తో సూపర్‌స్టార్‌గా ఎదిగాడు మహేశ్‌బాబు. హిట్లొచ్చినా.. ఫ్లాప్స్ ఎదురైనా చెక్కు చెదరని క్రేజ్ ప్రిన్స్ సొంతం. మహేశ్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఆయన అందం. ఆరడుగుల ఎత్తు, పాలనురగ లాంటి స్కిన్‌టోన్‌తో తళతళ మెరిసిపోతాడు సూపర్‌స్టార్. అందుకే ఆయన అమ్మాయిల కలల రాకుమారుడు. సీనియర్ హీరోయిన్లైనా.. ఇప్పుడిప్పుడే వస్తున్న ముద్దుగుమ్మలైనా మీరు ఏ హీరోతో నటించాలి అనుకుంటున్నారు అని అడిగితే.. టక్కున వచ్చే సమాధానం మహేశ్‌బాబే. టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లో కూడా మహేశ్‌ను మించిన అందగాడు లేడంటూ ఎంతోమంది చెబుతూ ఉంటారు.

తోటి హీరోలు కూడా ఆయన అందాన్ని పొగుడుతూ.. కొంతమంది లోలోపల కుళ్లుకుంటూ ఉంటారన్నది వాస్తవం. మొన్నటికి మొన్న మహేశ్ లాంటి అందం దేవుడు తనకు ఇచ్చి ఉంటే ఎంత బావుండేదో అంటూ మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తన మనసులోని మాటను చెప్పేశాడు. రీసెంట్‌గా ఈ లిస్ట్‌లోకి మెగాస్టార్ మేనల్లుడు సాయిథరమ్ తేజ్ కూడా చేరాడు. జవాన్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న సాయిని మీరు ఈ మూవీలో మహేశ్‌ కన్నా అందంగా ఉన్నారంటూ ఓ జర్నలిస్ట్ అన్నాడు.. దీనిపై వెంటనే రీయాక్ట్ అయిన తేజూ, మహేశ్‌బాబు గారి కంటే అందగాడు ఉంటాడా.. సమస్యే లేదు.. అసలు అలా ఆలోచించడం కూడా వేస్ట్ అనేయడంతో అక్కడున్న వారంతా షాకయ్యారట. మెగా హీరోలంతా పనిగట్టుకొని మరీ మహేశ్‌ని ఆకాశానికి ఎందుకు ఎత్తేస్తున్నారో అర్థం కాకవారు జుట్టు పీక్కొంటున్నారట. క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైమింగ్‌లో వచ్చాయా..? లేకపోతే దీని వెనుక ఏదైనా మెగా స్కెచ్ ఉందా అంటూ ఫిలింనగర్‌తో పాటు సోషల్ మీడియాలోనూ హాట్ డిస్కషన్ నడుస్తోంది.