English | Telugu

ఆ దర్శ‌కుడిపై ర‌వితేజ ఫైర్‌..!

సినిమా బాగా ఆడితే, హిట్ట‌యితే అంతా హ్యాపీనే. అంచ‌నాలు త‌ల‌కిందులై... ఫ్లాప్ మూట‌గ‌ట్టుకొంటే మాత్రం లెక్క‌లూ మారిపోతాయి. ఫ్లాప్‌కి కార‌ణం మీరంటే మీరంటూ కొట్టుకు చచ్చిపోతుంటారు. కిక్ 2 విష‌యంలోనూ అదే జ‌రిగింది. ఈ సినిమా అవుట్ పుట్‌పై ముందు నుంచీ క‌ల్యాణ్‌రామ్‌, ర‌వితేజ ఇద్ద‌రూ సంతృప్తిగా లేర‌ని కామెంట్లు వినిపించాయి. సినిమా ఫ‌లితం కూడా అలాగే రావ‌డంతో... ఇప్పుడు వీళ్లంద‌రి మ‌ధ్య గ్యాప్ మ‌రింత‌గా పెరిగిపోతోంది.

`ఈ సినిమా ఫ్లాప్‌కి కార‌ణం ద‌ర్శ‌కుడే` అంటూ ర‌వితేజ కూడా బాహాటంగానే చెప్పేస్తున్నాడ‌ట‌. సినిమా చూశాక‌.. సెకండాఫ్ బాగోలేద‌ని, మార్పులు అవ‌స‌ర‌మ‌ని ర‌వితేజ సూచించాడ‌ట‌. అయితే.. సురేంద‌ర్‌రెడ్డి మాత్రం ర‌వితేజ మాట‌లు అస్సలు విన‌లేద‌ట‌. సినిమాని ట్రిమ్ చేద్దామ‌ని నిర్మాత క‌ల్యాణ్‌రామ్ ఎన్నిసార్లు చెప్పినా సురేంద‌ర్‌రెడ్డి చెవికెక్కించుకోలేద‌ని టాక్‌. అందుకే క‌ల్యాణ్‌రామ్‌కీ, సురేంద‌ర్ రెడ్డికీ గ్యాప్ వ‌చ్చేసింద‌ని తెలుస్తోంది. బ‌డ్జెట్ పెరిగినా బాధ‌ప‌డ‌ని క‌ల్యాణ్‌రామ్ - త‌న చెప్పిన మాట విన‌క‌పోయేస‌రికి సూరిపై ఫైర్ అయ్యాడ‌ని టాలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

సినిమా విడుద‌లైన రెండో రోజే.. క‌ల్యాణ్‌రామ్ రంగంలోకి దిగి 20 నిమిషాల సినిమాని లేపేశాడు. అది సురేంద‌ర్‌రెడ్డికి ఇష్టం లేద‌ని తెలుస్తోంది. సినిమాకొచ్చిన టాక్‌, భ‌రించాల్సిన న‌ష్టం ఇవ‌న్నీ చూసుకొన్న క‌ల్యాణ్‌రామ్ ఇక భ‌విష్య‌త్తులో సూరితో సినిమా చేయ‌కూడ‌ద‌ని డిసైడ్ అయ్యాడ‌ట‌. మ‌రోవైపు ర‌వితేజ కూడా ఇదే విష‌యం స‌న్నిహితుల‌కు చెబుతున్నాడ‌ట‌. కిక్ 3 రాబోతోంది..రాబోతోంది అని డంకా బ‌జాయించినా.. ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే అంత సీన్ లేద‌న్న‌ది స్ప‌ష్టం అవుతోంది.