English | Telugu

మహేశ్‌తో మల్టీస్టారర్‌‌కు సై అన్న చరణ్..?

తెలుగు చిత్ర పరిశ్రమలో రెండు ధ్రువాల్లాంటి నందమూరి-కొణిదెల నట వారసులు మల్టీస్టారర్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో.. టాలీవుడ్‌లో మళ్లీ మల్టీస్టారర్‌కు ఊపొచ్చింది. వీరిని చూసి చాలా కాంభినేషన్లు తెర మీదకు వచ్చాయి. వాటిలో మహేశ్-బాలకృష్ణ, పవన్-చిరు, వెంకటేశ్ -వరుణ్ తేజ్ ఉన్నాయి. ఇప్పుడు లేటేస్ట్‌గా మహేశ్-చరణ్ మల్టీస్టారర్ చేయబోతున్నారనే వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఎవరో చెబితే దీనిని పట్టించుకునే వారు కాదు.. కానీ స్వయంగా రామ్‌చరణే ఈ న్యూస్ చెప్పాడు. రంగస్థలం ప్రమోషన్‌లో భాగంగా తన ఫేస్‌బుక్ నుంచి అభిమానులతో లైవ్ చిట్ చాట్ చేశాడు చెర్రీ.

ఈ సందర్భంగా ఒక అభిమాని మీరు.. మహేశ్‌తో మల్టీస్టారర్ చేస్తారా అని ప్రశ్నించగా.. దీనికి స్పందించిన చరణ్.. ఇండస్ట్రీలో నాకున్న మంచి స్నేహితుల్లో మహేశ్‌బాబు ఒకరు.. ఆయనతో రెగ్యులర్‌గా టచ్‌లోనే ఉంటా.. ఇద్దరం పార్టీల్లో కలుస్తూనే ఉంటామని చెప్పారు. మంచి కథతో ఎవరైనా వస్తే.. సూపర్‌స్టార్‌తో మల్టీస్టారర్‌ చేయడానికి ఎప్పుడూ రెడీనే అన్నాడు చెర్రీ. తమ సినిమా సెట్ మీద నుంచి థియేటర్లలోకి వచ్చేటప్పుడు.. వేరే హీరో ఫ్యాన్స్‌ని ప్రసన్నం చేసుకోవడానికి.. పాత విషయాలను.. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని బయటకి చెప్పడం ఎన్నో సందర్భాల్లో చూశాం. ఇప్పుడు చెర్రీ కూడా ఇదే దారిలో నడిచాడా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. అలా కాకుండా ఒకవేళ చరణ్-మహేశ్‌ తెరను పంచుకుంటే అభిమానులకే పండగే.