English | Telugu

రామ్‌... కాస్త ఓవ‌ర్ చేస్తున్నాడా??

అభిమానుల్ని దృష్టిలో ఉంచుకొనే క‌థ‌ల్ని ఎంచుకొంటున్నా.. అంటూ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు రామ్‌! ప్ర‌తీ హీరోకీ అంతో ఇంతో అభిమాన బ‌లం ఉంటుంది. రామ్ లాంటి వాళ్ల‌కూ ఉంటుంది. కానీ వాళ్ల సంఖ్య ఎంత‌? రామ్ సినిమా అంటే పొలో మంటూ.. ప‌నుల‌న్నీ వ‌దిలేసే ల‌గెత్తేసే ఫ్యాన్స్ ఎంత మంది ఉంటారు? అస‌లు రామ్ ఫ్యాన్స్ వ‌ల్లే హిట్ట‌యిన రామ్ సినిమాలెన్ని?? ఈ డైలాగులు ఎన్టీఆర్‌, ప‌వ‌న్, మ‌హేష్ లాంటి స్టార్లు చెబితే ఓకే అనుకోవొచ్చు. ఆ మాట‌కొస్తే వాళ్లు అస‌లు ఇలాంటి రాంగ్ స్టేట్‌మెంట్లు ఎప్పుడూ ఇవ్వ‌లేదు. అభిమానుల‌కే కాదు, అంద‌రికీ న‌చ్చేసినిమాలు చేస్తాం.. అంటారంతా. కానీ రామ్ మాత్రం వెరైటీగా స్పందించాడు. అక్క‌డికేదో కోట్ల‌లో త‌న‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న‌ట్టు. స్టార్ హీరోలే ఇమేజ్‌, ఫ్యాన్ ఫాలోయింగ్ అనే ఇమేజ్‌ల నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. కానీ రామ్‌లాంటి వాళ్లు వాటి చుట్టూ గిర్రు గిర్రుమంటూ తిరుగుతున్నారు.

నేను శైల‌జ‌తో ఓ డీసెంట్ ప్ర‌య‌త్నం చేశాడు రామ్‌. ఆసినిమా బాగా ఆడింది. రామ్‌ చాలా కాలం నుంచీ ఎదురుచూస్తున్న హిట్టొచ్చింది. ఆ త‌ర‌వాత కూడా అలాంటి ప్ర‌య‌త్నాలే చేయకుండా మ‌ళ్లీ మాస్ బాట ప‌ట్టేశాడు.. హైప‌ర్‌తో. ఆసినిమా టైటిల్ మాత్ర‌మే కాదు.. క‌థ క‌థ‌నాలు కూడా ఫుల్ మాసీగానే ఉండ‌బోతున్నాయ‌న్న‌ది ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. శివ‌మ్‌, పండ‌గ చేస్కో సినిమాల్లో ఇలానే మాస్ బాట ప‌ట్టి చేతులు కాల్చుకొన్నాడు. మ‌ళ్లీ అలాంటి ప్ర‌య‌త్నం చేస్తే ఎలా అని రామ్‌ని అడిగితే.. ''నేను శైల‌జ బాగానే ఉన్నా.. నా ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో సంతృప్తి ప‌డ‌లేదు..'' అంటూ ఓవ‌ర్ చేస్తున్నాడు. ఇలాగైతే ఎలా రామ్‌...???