English | Telugu

చ‌ర‌ణ్‌కి ఎన్ని తిప్ప‌లో??

ఎప్పుడూ లేనంత‌గా రామ్‌చ‌ర‌ణ్ త‌న సినిమా `బ్రూస్లీ`ని ప్ర‌మోట్ చేసుకోవ‌డానికి తెగ తాప‌త్ర‌య‌ప‌డుతున్నాడు. అందులో భాగంగానే... బాబాయ్ ప‌వన్ క‌ల్యాణ్‌ని సెట్లో క‌లిశాడు. త‌మ ఇంటికి పిలిచాడు. `బాబాయ్ మేమూ ఒక్క‌టే సుమా` అంటూ ప్ర‌పంచానికి ముఖ్యంగా ప‌వ‌ర్ స్టార్ అభిమానుల‌కు చాటాల‌నుకొన్నాడు. స‌డ‌న్‌గా బాబాయ్ పై చ‌ర‌ణ్‌కి ఇంత ప్రేమ ఎందుకొచ్చేసింది అని అడిగితే.. ఒక్క‌టే స‌మాధానం - బ్రూస్లీ సినిమాని నిల‌బెట్టుకోవాలి.

ఎందుకంటే బెనిఫిట్ షో ప‌డే స‌మ‌యానికే... బ్రూస్లీ ఫ్లాప్ టాక్ టాలీవుడ్ అంతా పాకేసింది. రెండో రోజుకే స‌గం థియేట‌ర్లు ఖాళీ అయ్యాయి. ఈ ప‌రిస్థితిని ఊహించ‌ని చ‌ర‌ణ్.. షాక్ తిన్నాడు. వెంట‌నే త‌న సినిమాకీ,ప్ర‌స్తుత ప‌రిస్థితికీ పోస్ట్ మార్ట‌మ్ నిర్వ‌హించుకొన్నాడు. సినిమాలో ఎలానూ మార్పులుచేయ‌లేడు. అందుకే బాబాయ్‌ అభిమానుల్ని త‌న‌వైపుకు తిప్పుకోవాల‌నుకొన్నాడు. ప‌వ‌న్ అభిమానులు చాలా చోట్ల‌... ఈ సినిమాని బోయ్‌కాట్ చేశార‌ని స‌మాచారం. మ‌రీ ముఖ్యంగా మెగా కుటుంబానికి వెన్నుద‌న్నుగా నిలిచే ఈస్ట్, వెస్ట్‌ల‌లో.. ఈ ప‌రిస్థితి మ‌రీ దారుణంగా ఉంద‌ని గ‌మ‌నించాడు చ‌ర‌ణ్‌. అందుకే బాబాయ్‌ని మ‌చ్చిక చేసుకొనేందుకు రంగంలోకి దిగాడు.

చ‌ర‌ణ్‌పై ముందు నుంచీ.. ప్రేమ‌గా ఉండే ప‌వ‌న్‌.. ప‌రిస్థితిని అర్థం చేసుకొని త‌న వంతు చేయూత నిచ్చేందుకు ముందుకొచ్చాడు. అందుకే అన్న‌య్య స‌న్నిథీ... అదే నాకు పెన్నిథీ అంటూ ఇంటికెళ్లి మ‌రీ క‌లిసొచ్చాడు. మ‌రి ఈ ప్రేమ బ్రూస్లీ వ‌ర‌కేనా, ఆ త‌ర‌వాతా కొన‌సాగుతుందా అనేది మెగా అభిమానుల ప్ర‌శ్న‌. ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం బ‌హుశా మెగా హీరోల‌కూ తెలీదేమో??