English | Telugu

చ‌ర‌ణ్, ర‌కుల్.. ముచ్చ‌ట‌గా మూడోసారి?

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న క‌నువిందు చేసిన నాయిక‌ల్లో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఒక‌రు. `బ్రూస్ లీ`, `ధ్రువ‌`.. ఇలా చ‌ర‌ణ్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో ర‌కుల్ హీరోయిన్ గా న‌టించింది. వీటిలో `బ్రూస్ లీ` నిరాశ‌ప‌ర‌చ‌గా.. `ధ్రువ‌` ఓకే అనిపించుకుంది. క‌ట్ చేస్తే.. దాదాపు ఐదేళ్ళ విరామం అనంత‌రం ఈ ఇద్ద‌రు మ‌రోమారు జ‌ట్టుక‌ట్ట‌నున్నార‌ని టాక్.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. `ఆచార్య`, `ఆర్ ఆర్ ఆర్` వంటి మ‌ల్టిస్టార‌ర్స్ త‌రువాత చ‌ర‌ణ్ సోలో హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఏస్ డైరెక్ట‌ర్ శంక‌ర్ రూపొందించ‌నున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించ‌నున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రంలో ఓ నాయిక‌గా ర‌కుల్ ప్రీత్ సింగ్ ని ఎంచుకున్నార‌ని టాక్. వాస్త‌వానికి.. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌ట్టాలెక్కి తాత్కాలికంగా ఆగిపోయిన‌ `ఇండియ‌న్ 2` కోసం.. ర‌కుల్ కేటాయించిన కాల్షీట్స్ ని ఈ ప్రాజెక్ట్ కి వినియోగించుకుంటున్నార‌ట. త్వ‌ర‌లోనే #RC15లో ర‌కుల్ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

మ‌రి.. చెర్రీతో ర‌కుల్ ముచ్చ‌ట‌గా మూడోసారి జోడీక‌డుతుందో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.