English | Telugu

రాజు సుంద‌రం దర్శకత్వంలో శర్వానంద్!

ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్‌ రాజు సుంద‌రం దర్శకుడిగా తెలుగులో ఓ సినిమా చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో దర్శకుడిగా తమిళ్ లో ఓ సినిమా చేసి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయిన ఆయన.. ఈసారి దర్శకుడిగా తన అదృష్టాన్ని తెలుగులో పరీక్షించుకోనున్నారని టాక్ వినిపిస్తోంది.

కోలీవుడ్ స్టార్ అజిత్, నయనతార జంటగా రాజు సుంద‌రం దర్శకత్వంలో వచ్చిన సినిమా 'ఏగన్'. 2008లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. దర్శకుడిగా తొలి ప్రయత్నం నిరాశపరచడంతో.. ఇప్పటిదాకా రాజు సుంద‌రం మళ్ళీ మెగా ఫోన్ పట్టలేదు. అయితే మళ్ళీ ఇంతకాలానికి రాజు సుంద‌రం మనసు దర్శకత్వం వైపు మళ్లిందని తెలుస్తోంది. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ తో ఓ సినిమా చేయడానికి ఆయన రెడీ అవుతున్నారట. ఈ మూవీకి వక్కంతం వంశీ కథ-స్క్రీన్ ప్లే అందిస్తున్నారని.. ఈ ప్రాజెక్ట్ కి శర్వా కూడా ఓకే చెప్పారని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన రానుందని సమాచారం.

కాగా శర్వా ప్రస్తుతం అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహాసముద్రం', కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే సినిమాలు చేస్తున్నాడు. ఆ తర్వాత రాజు సుంద‌రం ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని టాక్.