English | Telugu

ఆ త‌ప్పు చేయ‌నంటున్న రాజ‌మౌళి

బాహుబ‌లి దెబ్బ‌తో... టాలీవుడ్ లెక్క‌ల‌న్నీ మారిపోయుండొచ్చు. బాలీవుడ్ కూడా మెడ‌లు నొప్పెట్టేలా టాలీవుడ్ వంక చూసుండొచ్చు. ఇదో ఇండియ‌న్ అవ‌తార్ అని సినీ విశ్లేష‌కులు కీర్తించి ఉండొచ్చు. బాహుబ‌లి ఓ తీపి మిఠాయి పొట్లాం అనిపించి ఉండొచ్చు. కానీ దాని చుట్టూచీమ‌లెన్ని ఉన్నాయో.... రాజ‌మౌళికే తెలుసు. ఈ సినిమా నిర్మాణంలో విప‌రీత‌మైన జాప్యం జ‌రిగింది. ఎంత ప‌క్కాగా షూటింగ్ జ‌రిగినా చాలా త‌ప్పులు దొర్లాయి. బాహుబ‌లి క‌థ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. అంతెందుకు..?? సినిమాలో కీల‌క ఘ‌ట్ట‌మైన వార్ సీన్లు లీకైపోయాయి. ఈ త‌ప్పుల అంతు చూద్దామ‌నుకొంటున్నాడు రాజ‌మౌళి.

బాహుబ‌లి 2లో ఇలాంటి పొర‌పాట్ల‌కు తావివ్వ‌కూడ‌ద‌ని రాజ‌మౌళి డిసైడ్ అయ్యాడు. అందుకే త‌న టీమ్ అంద‌రిన్నీ పిలిపించి ఓ భారీ క్లాస్ పీకాడ‌ట‌. ప్ర‌భాస్, రానా, అనుష్క‌, ర‌మ్య‌కృష్ణ‌, సింథిల్‌.. ఇలా న‌ట‌, సాంకేతిక వ‌ర్గంలోని కీల‌క వ్య‌క్తుల‌తో రాజ‌మౌళి ఓ మీటింగ్ ఏర్పాటు చేశాడ‌ట‌. అందులో బాహుబ‌లి 2 షూటింగ్‌లో తీసుకోవాల్సిన‌ జాగ్ర‌త్త‌ల‌తో పాటు.. ఈ సినిమాకి సంబంధించిన కీల‌క‌మైన స‌మాచారం బ‌య‌ట‌కు రాకుండా ఏం చేయాలో సూచించాడ‌ట‌.

పొర‌పాటున కూడా బాహుబ‌లి 2 క‌థ గురించి బ‌య‌ట చెప్పొద్ద‌న్నాడ‌ట‌. అలా చెప్పిన‌ట్టు తెలిస్తే.. వాళ్ల‌తో క‌ఠినంగా ప్ర‌వ‌ర్తించ‌డానికి కూడా వెనుకాడ‌న‌ని వార్నింగ్ ఇచ్చాడ‌ట‌. సెట్లో సెల్‌ఫోన్ల‌ను బాహుబ‌లి 1 స‌మ‌యంలోనే నిషేధించినా, అది ప‌ర్‌ఫెక్ట్‌గా అమ‌లు కాలేదు. ఈసారి అలాంటి పొర‌పాటు జ‌ర‌క్కూద‌న్న ఉద్దేశంలో ఉన్నాడు జ‌క్క‌న్న‌. అందుకే టీమ్‌లో ఎవ్వ‌రూ సెట్‌కి సెల్‌పోన్ తీసుకురాకూడ‌ద‌న్న‌నిబంధ‌న విధించాడ‌ట‌. ఇలా.. బాహుబ‌లి 2 విష‌యంలో ముందు నుంచే జాగ్ర‌త్త ప‌డుతున్నాడు ఈ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌. మ‌రి ఇవ‌న్నీ అమ‌ల‌వుతాయా, ఈ ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు ప‌లిస్తాయా..? ఏమో మ‌రి.. వీటికి స‌మాధానం త్వ‌ర‌లోనే తెలుస్తుంది.