English | Telugu

అఖిల్ డెబ్యూ స్టొరీ ఇదేనా?

అఖిల్ డెబ్యూ మూవీ అఖిల్ సినిమాపై అభిమనులలోనే కాదు పరిశ్రమలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ కథ ప్రచారం జరుగుతుంది. ఆ కథ ఏమిటంటే…అఖిల్ విదేశాల్లో టూరిస్ట్ గైడ్‌గా ప‌ని చేస్తుంటాడు. హీరోయిన్ స‌యేషా సైగ‌ల్ కూడా ఉన్న‌త చ‌దువుల కోసం ఫారిన్ వెళుతుంది. స‌యేషా త‌న స్నేహితుల‌తో క‌లిసి విహార‌యాత్ర‌కు వ‌స్తుంది.

అఖిల్ వీరి టీంకు టూరిస్ట్ గైడ్‌గా ఉంటాడు. ఆమెతో ప‌రిచ‌యం చిన్న‌పాటి గొడ‌వ‌కు దారితీసి..త‌ర్వాత క్ర‌మ‌క్ర‌మంగా ప్రేమ‌గా మారుతుంది. అంతలోనే స‌యేషా స‌డెన్‌గా కిడ్నాప్‌ అవుతుంది. దీంతో షాక్ అయిన అఖిల్ త‌న ప్రేయ‌సిని వెతుక్కుంటూ ఆఫ్రికాలోని కాంగో న‌ది స‌మీపంలోని భూమ‌ధ్యరేఖ వ‌ద్ద ఉన్న గిరిజ‌న ప్రాంతానికి వెళ‌తాడు. అక్క‌డ అఖిల్‌కు కొండజాతి వారితో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. వారు ఎంతో దైవంగా భావించి కొలిచే గోల్డెన్‌బాల్ గురించి అఖిల్‌కు తెలుస్తుంది. దానిని తాక‌గ‌లిగే వ్య‌క్తి వ‌స్తే ఈ స‌మ‌స్త విశ్వానికి మంచి జ‌రుగుతుంద‌ని అఖిల్ తెలుసుకుంటాడు. అక్క‌డ నుంచి క‌థ చాలా ట్విస్టుల‌తో…ఊహించ‌ని మ‌లుపుల‌తో ముందుకు వెళుతుంది.

చివ‌ర‌గా ఈ గోల్డెన్‌బాల్ కోసం విదేశాల్లో ఉండే కొన్ని సంఘవిద్రోహ శ‌క్తులు ట్రై చేస్తుంటాయి. వీరు హీరోయిన్ ద్వారా హీరోను తమ ఊళ్లోకి రప్పించడంతో కథ క్లైమాక్స్ కు చేరుతుంది. అయితే ఈ స్టొరీ నిజమో కాదో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రతీ సినిమా స్టొరీ ఇదేనంటూ పెట్టడం ఓ ఫ్యాషన్ గా మారింది. ఇందులో కేవలం కొన్ని కథలు మాత్రమే నిజమవుతున్నాయి. మిగతావన్ని కల్పితాలే!!