English | Telugu

`స‌లార్`లో మాలీవుడ్ స్టార్?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ చేస్తున్న పాన్ - ఇండియా మూవీస్ లో `స‌లార్` ఒక‌టి. `కేజీఎఫ్` కెప్టెన్ ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్ష‌న్ సాగాలో ప్ర‌భాస్ కి జోడీగా శ్రుతి హాస‌న్ న‌టిస్తుండ‌గా.. ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన‌ షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతోంది.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార‌న్ ని సంప్ర‌దించార‌ని స‌మాచారం. పాత్ర నిడివి త‌క్కువే అయినా ఎంతో ప్రాధాన్యం ఉండ‌డంతో.. పృథ్వీరాజ్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని బ‌జ్. త్వ‌ర‌లోనే `స‌లార్`లో పృథ్వీరాజ్ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది. మ‌రి.. మాలీవుడ్ లో వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌తో అల‌రిస్తున్న పృథ్వీరాజ్.. `సలార్`లో ఎలాంటి పాత్ర‌లో క‌నిపిస్తారో చూడాలి.

కాగా, `స‌లార్`కి `కేజీఎఫ్` ఫేమ్ ర‌వి బస్రూర్ సంగీత‌మందిస్తుండ‌గా, భువ‌న్ గౌడ ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు. `కేజీఎఫ్` నిర్మాణ సంస్థ హోంబ‌ళే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. 2022లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది.