English | Telugu

ప్రభుదేవా దర్శకత్వంలో చిరంజీవి.. మళ్ళీ రీమేకేనా?

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ 'గాడ్ ఫాదర్' అక్టోబర్ 5న విడుదల కానుంది. 'వాల్తేరు వీరయ్య', 'భోళా శంకర్' షూటింగ్ దశలో ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రభుదేవా దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి చిరంజీవి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడిగా ప్రభుదేవా ప్రయాణం తెలుగులోనే ప్రారంభమైంది. తెలుగులో 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'(2005), 'పూర్ణమి'(2006), 'శంకర్ దాదా జిందాబాద్'(2007) సినిమాలను డైరెక్ట్ చేసిన ఆయన.. ఆ తర్వాత తమిళ్, హిందీ భాషల్లోనే సినిమాలు చేశారు. అయితే 15 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ తెలుగులో ఓ సినిమా డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. 

'గాడ్ ఫాదర్'లో ఓ సాంగ్ కి ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. ఆ సమయంలోనే చిరంజీవి, ప్రభుదేవా మధ్య సినిమా చేయాలనే చర్చ వచ్చినట్లు తెలుస్తోంది. రీమేక్ సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా.. చిరంజీవితో మళ్ళీ ఏదైనా రీమేక్ చేస్తారో లేక సరికొత్త స్క్రిప్ట్ తో ఒరిజినల్ ఫిల్మ్ చేస్తారో చూడాలి. చిరంజీవితో చేసిన 'శంకర్ దాదా జిందాబాద్' తర్వాత టాలీవుడ్ కి దూరమైన ప్రభుదేవా ఇప్పుడు 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ చిరంజీవి సినిమాతోనే రీఎంట్రీ ఇస్తున్నారనే న్యూస్ రావడం ఆసక్తికరంగా మారింది.