English | Telugu

మారుతి మూవీలో డ్యూయల్ రోల్.. తాత పాత్రలో ప్రభాస్!

ప్రస్తుతం 'ఆదిపురుష్', 'సలార్', 'ప్రాజెక్ట్-k' వంటి భారీ ప్రాజెక్ట్ లు చేస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అనూహ్యంగా మారుతి డైరెక్షన్ లో ఓ సినిమా కమిట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టాలని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్ కూడా చేశారు. కానీ ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నవంబర్ లో షూటింగ్ కూడా మొదలు కానుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ చక్కర్లు కొడుతోంది.

 

హారర్ కామెడీ నేపథ్యంలో తాతమనవళ్ల కథగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని తెలుస్తోంది. తాతగా, మనవడిగా రెండు విభిన్న పాత్రల్లో కనిపించి అలరించనున్నాడని సమాచారం. స్టోరీ లైన్ నచ్చడంతో పాటు, నటనకు ఎక్కువ ఆస్కారం ఉండటంతోనే ప్రభాస్ ఈ సినిమాకి ఓకే చెప్పినట్లు టాక్. పైగా 'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటించిన 'సాహో', 'రాధేశ్యామ్' భారీ అంచనాలతో విడుదలై నిరాశపరిచాయి. అందుకే ఒక చిన్న ప్రాజెక్ట్ తో తక్కువ అంచనాలతో వచ్చి సర్ ప్రైజ్ హిట్ అందుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. 'ఏమో గుర్రం ఎగరావచ్చు' అన్నట్లుగా అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ మారుతి ఈ సినిమాతో మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి.

 

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి 'రాజా డీలక్స్' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.