English | Telugu

కాశీయాత్రకి పవన్.. వణికిపోతున్న ఫ్యాన్స్

భారతదేశంలోని ప్రాచీన నగరాల్లో ఒకటిగా.. దేశ ఆధ్యాత్మిక రాజధానిగా విలసిల్లుతోంది కాశీ. జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్లి గంగలో ఇష్టమైనది ఏదో ఒకటి వదిలి.. ఆ విశ్వేశ్వరుని దర్శిస్తే ఎంతో పుణ్యమని భక్తులు నమ్ముతారు. ఇంతటి విశిష్టత కలిగిన కాశీని మన సినిమా వాళ్లు వదులుతారా..? బాలీవుడ్ నుంచి కోలీవుడ్ దాకా ఇప్పటి వరకు కాశీ బ్యాక్‌డ్రాప్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే వీరందరిలో మెగా ఫ్యామిలీ ఎంతో పుణ్యం చేసుకుందని చెప్పవచ్చు. ఈ కుటుంబంలోని ముగ్గురు హీరోల సినిమాలు కాశీలోనే షూటింగ్ జరుపుకున్నాయి. వాటిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా వారణాసిలోనే నడుస్తుంది. ఈ సినిమా అప్పట్లో ఆల్‌టైం రికార్డులను తిరగరాసింది.

ఆ తర్వాత చిరు వారసుడు రామ్‌చరణ్‌తో వినాయక్ తీసిన నాయక్‌లో కుంభమేళా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఇంటర్వెల్ సీన్ ఆ మూవీకే హైలెట్‌గా నిలిచింది. ఇక పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, జయంత్ సి పరాన్జీ కాంభినేషన్‌లో వచ్చిన తీన్‌మార్ కూడా కాశీలోనే షూటింగ్ జరుపుకుంది. ఇంద్ర బ్లాక్‌బస్టరైతే, నాయక్ పర్వాలేదనిపించుకుంది.. కానీ పవన్‌కి మాత్రం కాశీ అస్సలు కలిసిరాలేదు. తీన్‌మార్ అట్టర్‌ ఫ్లాపై అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. రీసెంట్‌గా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న అజ్ఞాతవాసి ఫైనల్‌ షెడ్యూల్‌ కాశీలో జరిగిందట. ఈ సంగతి తెలుసుకున్న పవన్ అభిమానులు వణికిపోతున్నారట. తీన్‌మార్ రిజల్ట్ నెగిటివ్‌గా రావడంతో ఈసారి అజ్ఞాతవాసికి ఏం జరుగుతుందోనని వారంతా ఆందోళన చెందుతున్నారని ఫిలింనగర్‌లో చర్చించుకుంటున్నారు. మరి ఈసారి కాశీ సెంటిమెంట్‌ పవన్‌ని ఏం చేస్తుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.