English | Telugu

పవన్‌ని నమ్ముకుని రత్నం అప్పుల పాలేనా..?

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌తో సినిమా తీయాలని ఏ నిర్మాతకు ఉండదు చెప్పండి..సినిమా ఫలితంతో సంబంధం లేకుండా కాసుల వర్షం కురిపించే సత్తా పవర్‌స్టార్ సొంతం. అందుకే ఆయనతో సినిమా తీయాలని ఎన్నో నిర్మాణ సంస్థలు క్యూకడుతుంటాయి. 2019 ఎన్నికల నాటికి ఎన్ని కుదిరితే అన్ని సినిమాలు చేయాలని భావిస్తుండటంతో ఒక్కొక్క మూవీకి కొబ్బరికాయ కొడుతున్నాడు పవన్. కాటమరాయుడు తర్వాత త్రివిక్రమ్ మూవీని సైలెంట్‌గా స్టార్ట్ చేశాడు.. అంతా బాగానే ఉంది కాని ఒక నిర్మాతకు ఇచ్చిన మాటను మాత్రం పవన్ మరచిపోయినట్లున్నారు. గతంలో ఖుషీ, బంగారం వంటి సినిమాలను పవర్‌స్టార్‌తో నిర్మించిన ఏఎం రత్నం ఆయనతో ముచ్చటగా మూడో సినిమాను తీయాలనుకున్నారు.

దీనిలో భాగంగా ఆర్.టీ.నీశన్ దర్శకత్వంలో తమిళ్‌లో సూపర్‌హిట్టయిన వేదాలం మూవీని రీమేక్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూజా కార్యక్రమాలు గత అక్టోబర్‌లోనే జరిగాయి. రత్నం ఇంకొంచెం ముందుకెళ్లి థమన్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ వేసి రెండు సాంగ్స్ కంపోజ్ చేయించాడు. అయితే త్రివిక్రమ్ మూవీ పూర్తవ్వడానికి కనీసం ఆరు నెలలు పడుతుంది..మరోవైపు మైత్రీ మూవీస్ లాంటి సంస్థలు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చి అయినా పవన్‌తో సినిమా తీయాలనుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా నెక్ట్స్ మూవీ నీతోనే అన్న మాట మాత్రం రత్నానికి జనసేనాని నుంచి రావడం లేదు. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన రత్నం పవన్ మూవీ ప్రి పోడక్షన్ వర్క్ కోసం బోలెడంత డబ్బు ఖర్చుపెట్టాడట..ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పవన్ కనుక హ్యాండ్ ఇస్తే రత్నం నిండా మునిగినట్లే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు.