English | Telugu
బస్సు యాత్రకు ముందే పవన్ కళ్యాణ్ సీక్రెట్ సర్వే?
Updated : Apr 25, 2016
పవన్ కల్యాణ్ మనసు సినిమాలవైపు నుంచి.... పూర్తిగా రాజకీయాల వైపు మళ్లింది. ఆయన ఏదో నామ్ కే వాస్తే అన్నట్టు సినిమాలు ఒప్పుకొంటున్నా.. మనసు. ప్రాణం.. పాలిటిక్స్ పైనే ఉన్నాయి. ఈ లోపు వీలైనన్ని సినిమాలు చేయడం, బ్యాంకు బ్యాలెన్సు పెంచుకోవడానికే అన్నది అర్థమైపోతోంది. ఇటీవల పవన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఈ సంగతి ఆయన చెప్పకనేచెప్పారు. త్వరలోనే పవన్ బస్సు యాత్ర కూడా మొదలెట్టేస్తున్నాడు. ఎండలు బాగా తగ్గాక.. అప్పుడు పవన్ బస్సులో రెండు తెలుగు రాష్ట్ర్రాలూ చక్కర్లు కొట్టి వస్తాడు. ఈలోగా పవన్ సీక్రెట్‌గా ఓ సర్వే నిర్వహిస్తున్నాడని రాజకీయ వర్గాలు సైతం గుసగుసలాడుకొంటున్నాయి.
నియోజక వర్గాల వారీగా పవన్ సర్వే చేస్తున్నాడని, అక్కడ తన పార్టీకి సపోర్ట్ చేసేవాళ్లెవరు? ఎన్నికల్లో నిలబడితే ఎవరి నుంచి మద్దతు వస్తుంది? స్థానికంగా ఎవరి బలమెంత? తన పార్టీ నుంచి పోటీ చేసే సమర్థత ఎవరికి ఉంది? అనే విషయాలపై పవన్ లోతైన సర్వే చేస్తున్నాడట. అంతేకాదు... బస్సు యాత్రకు వస్తే స్థానికంగా తమతో పాటు ఉండేవాళ్లెవరు? వాళ్లంతా జన సమీకరణ చేయగలరా?? అనే విషయాలపైనా పవన్ ఆరా తీస్తున్నాడని తెలుస్తోంది. మొత్తానికి పవన్‌లోని రాజకీయ నాయకుడు ఇప్పుడిప్పుడే నిద్రలేస్తూ అచ్చమైన పొలిటీషియన్‌లా ఆలోచించడం మొదలెట్టాడు. చిరంజీవి ప్రజారాజ్యం సమయంలోనే ఇలాంటి సర్వేలే జరిగాయి. అప్పుడు అన్నీ పాజిటీవ్ రిపోర్టులే వచ్చాయి. కాబట్టి చిరు ధైర్యంగా అడుగులేశాడు. మరి తమ్ముడుకి ఎలాంటి రిపోర్టులు వస్తాయో.. ఆయనెలా రియాక్ట్ అవుతాడో??