English | Telugu

మరో తమిళ దర్శకుడితో పవర్ స్టార్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ముందునుంచీ ఎందుకో తమిళ దర్శకులంటే అమితమైన అభిమానం. ఆ అభిమానంతోనే పీక్ టైమ్స్ లో తమిళ తంబిలను నమ్మి వారికి ఆఫర్లు ఇచ్చాడు. అయితే.. "ఖుషీ"తో ఎస్.జె.సూర్య మినహా ఏ ఒక్క తమిళ దర్శకుడు కూడా పవన్ ఇచ్చిన సువర్ణావకాశాన్ని సరిగా వినియోగించుకోలేదు. "బంగారం"తో ధరణి, "పంజా"తో విష్ణువర్ధన్ వంటి తమిళ దర్శకులు పవన్ కళ్యాణ్ ను మాత్రమే కాక తెలుగు ప్రేక్షకులనూ తీవ్రంగా నిరాశపరిచారు.

మరి ఆ పాత స్మృతులను మరిచాడో లేక మరోమారు తమిళ తంబికి అవకాశం ఇచ్చి చూద్దాం అని ఫిక్సయ్యాడో తెలియదుగానీ పవన్ కళ్యాణ్ నటించబోయే 25వ చిత్రానికి "జిల్లా" ఫేమ్ నేసన్ ను దర్శకుడిగా ఎన్నుకొన్నాడని తెలుస్తోంది. తమిళ సూపర్ హిట్ చిత్రం "వేదాలమ్" రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏ.ఎం.రత్నం నిర్మించనున్నారు. మరి ఈ మారైనా పవన్ కళ్యాణ్ కు తమిళ దర్శకుడు హిట్ అందిస్తాడో లేదో చూడాలి!