English | Telugu
పవన్‌ని చిరు కూడా వాడేద్దామనుకొంటున్నాడా?
Updated : Dec 14, 2016
వాడుకొన్నవాళ్లకు వాడుకొన్నంత అనేది పవన్ కల్యాణ్ సూత్రం. పవన్ పేరు, టైటిళ్లు, స్టైలు, పాటలూ వీటన్నింటిపైనా పేటెంట్ హక్కులు చాలామందికి ఉన్నాయి. నితిన్ అయితే పవన్‌పై సర్వాధికారాలూ నాకే ఉన్నాయ్ అన్నట్టు ప్రవర్తిస్తుంటాడు. నితిన్ పాటల వేడుక అంటే... పవన్ అటెండెన్స్ పంపల్సరీ. నిఖిల్ లాంటి యంగ్ హీరోలు కూడా పవన్ నామ జపం చేస్తుంటారు. సప్తగిరి లాంటి కమెడియన్ కూడా పవన్‌ని ఎడా పెడా వాడేసుకొన్నాడంటే.. పవన్ ఎంత అందుబాటులో ఉంటాడో ఊహించుకోవొచ్చు. అయితే మెగా హీరోల కాంపౌండ్‌కి మాత్రం పవన్ ఎప్పుడూ దూరమే. రామ్‌చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్... వీళ్లందరి ఆడియో ఫంక్షన్లకు చిరు దూరమైపోయాడు. చిరంజీవి ఖైదీ నెం.150 పాటల వేడుకకూ పవన్ దూరంగానే ఉంటాడన్న టాక్ వినిపిస్తోంది.
అయితే ఇప్పుడు స్వయంగా చిరంజీవినే రంగంలోకి దిగి.. పవన్ ని బుజ్జగించాలని ప్రయత్నిస్తున్నట్టు టాక్. తమ్ముడ్ని దూరం చేశానన్న అపవాదు తనపై రాకుండా ఉండాలన్నా, పవన్ ఫ్యాన్స్ సహకారం ఖైదీ నెం. 150కి ఉండాలన్నా.. పవన్ హాజరు తప్పని సరి. అందుకే చిరు స్వయంగా పవన్‌ని ఆడియో ఫంక్షన్‌కి రమ్మని ఆహ్వానించాడని, పవన్ కూడా అందుకు సానుకూలంగా స్పందించాడని, ఈనెల 26న జరగబోతున్న ఆడియో ఫంక్షన్‌కి పవన్ తప్పకుండా హాజరు అవుతాడని చిత్రబృందం చెబుతోంది. సో.. పవన్‌ని చిరు కూడా వాడేయడం మొదలెట్టాడన్నమాట.