English | Telugu

ప‌వ‌న్‌ని వాడుకొంటే త‌ప్ప పూట‌ గ‌డ‌వ‌దా?



వాడుకొన్నోళ్ల‌కు వాడుకొన్నంత‌.. అన్న‌ట్టు దొరికాడు ప‌వ‌న్ కల్యాణ్‌. మెగా ఇంట్లోంచి వ‌చ్చిన హీరోలు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని వాడుకొన్నారంటే ఓ అర్థం ఉంటుంది. వాడూ వీడూ అని కాకుండా ప్ర‌తీవోడూ... ఆ స్టార్ డ‌మ్ మీద ప‌డ్డారేమో అనిపిస్తోంది. మొన్న‌టి వ‌ర‌కూ ఈ వాడకం నితిన్ కి ప‌రిమిత‌మ‌య్యింది. ఇప్పుడు అంద‌రూ తెగ వాడేసుకొంటున్నారు. గ‌త వారం విడుద‌లైన బెంగాల్ టైగ‌ర్‌లో ప‌వ‌న్ ని ఏకంగా ర‌జ‌నీకాంత్‌తో పోల్చి... సంతృప్తి ప‌డిపోయాడు సంప‌త్ నంది. ప‌వ‌న్‌తో ఎలాగైనా సినిమా చేయాల‌న్న‌ది ఆయ‌న ఉద్దేశం.. ఆశ‌.. ఆశ‌యం. దాన్ని నెర‌వేర్చుకోవాలంటే ఇలాంటి బిస్కెట్లు అప్పుడ‌ప్పుడూ కాస్త వ‌ద‌లాల్సిందే.

లుకెట్ ద ఫేస్ ఇన్ ద మిర్ర‌ర్ అంటూ త‌మ్ముడులోని పాట‌ని పోసానిపై చిత్రీక‌రించిన విధానంలోనూ ప‌వ‌న్‌పై సంప‌త్‌కున్న ప్రేమ క‌ట్ట‌లు క‌ట్ట‌లుగా క‌నిపిస్తుంటుంది. లోఫ‌ర్ లో వ‌రుణ్ తేజ్ బాబాయ్‌ని గుర్తు చేసే డైలాగులు చెప్తాడనుకొంటే.. అందులోనూ అలీపై ఇదే పాట‌ని తెర‌కెక్కించాడు పూరి. ప‌వ‌న్‌కీ ఆయ‌న‌కూ బాగా గ్యాప్ వ‌చ్చింది. కెమెరామెన్ గంగ‌తో రాంబాబు త‌ర‌వాత ప‌వ‌న్‌పై ప‌ర‌స్ప‌ర విరుద్ధ‌మైన వ్యాఖ్య‌లు చేస్తూ.. ప‌వ‌న్ అభిమానుల కోపానికి గుర‌య్యాడు పూరి. లోఫ‌ర్ కి సంబంధించిన ప్రెస్ మీట్ల‌లోనూ ప‌వ‌న్ ఫ్యాన్స్‌ని కెలికేశాడు. వాళ్ల‌ని శాంతింప‌చేయ‌డానికే ఈ పాట పెట్టి న‌ట్టు అర్థం అవుతోంది.

రేపు రాబోయే... జ‌త‌క‌లిసే సినిమాలోనూ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలోని స‌న్నివేశాల్ని స్నూఫ్‌లుగా మార్చారు. ఇదంతా ప‌వ‌న్ అభిమానుల్ని బుట్ట‌లో ప‌డేయ‌డానికే అన్న‌ది స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. చిన్నా చిత‌కా సినిమాలు, హీరోలు ప‌వ‌న్‌నివాడుకొన్నారంటే అర్థం ఉంది. పెద్ద హీరోలూ, పేరున్న ద‌ర్శ‌కులు కూడా ప‌వ‌న్‌ని వాడేస్తానంటే ఎలా?? ప‌వ‌న్‌ని వాడ‌కుంటే పూట కూడా గ‌డ‌వ‌న్న‌ట్టుంది వాళ్ల ప‌రిస్థితి. ప‌వ‌న్ మ్యాజిక్ అంతేనేమో?