English | Telugu
ఎన్టీఆర్ ముందు సవాళ్లెన్నో...?!
Updated : Jan 6, 2016
ఈ సంక్రాంతికి నాన్నకు ప్రేమతో సినిమా వచ్చేస్తోందని.. ఎన్టీఆర్ చెప్పేశాడు. 13న ముహూర్తం కూడా ఫిక్స్ చేశాడు. చెప్పిన సమయానికే తన సినిమా రావాలన్న పట్టుదలతో ఉన్నాడు ఎన్టీఆర్. అందుకే... అహర్నిశలూ కష్టపడుతున్నాడు. ఒక దశలో.. మధ్యలోనే డ్రాప్ అవ్వాలన్న ఆలోచన వచ్చింది. పండగ హడావుడి తగ్గాక ఫిబ్రవరిలో సినిమాని విడుదల చేయాలి.. అనుకొన్నాడు. కానీ.. రిలయన్స్ సంస్థ.. ఒత్తిడి మేరకు సినిమాని విడుదల చేయక తప్పని పరిస్థితులొచ్చాయి. అందుకే.. రేయింబవళ్లూ... ఈ సినిమా కోసం కష్టపడ్డాడు తారక్.
అయితే.. ఇప్పటికీ సినిమా విడుదల కాస్త అనుమానమే. ఎందుకంటే.. ఎన్టీఆర్ చుట్టూ అన్ని సవాళ్లున్నాయి. ఈనెల 13న సినిమా రావాలంటే... కనీసం 8వ తేదీకల్లా సెన్సార్ అయిపోవాలి. అందుకే 8వ తేదీన సెన్సార్ చేయమని.. ఓ విజ్ఞాపన పత్రాన్ని సెన్సార్ బోర్డుకు ముందే ఇచ్చేసింది చిత్రబృందం. సో.. సెన్సార్ టైమ్ ఫిక్సయ్యిందన్నమాట. 8వ సెన్సార్ అంటే కనీసం 7లోగా సినిమా పనులన్నీ అయిపోవాలి. ఆర్.ఆర్, డబ్బింగ్, ఎడిటింగ్, డీటీఎస్ మిక్సింగ్, ఫైనల్ డిఐ ఇవన్నీ జరగాలి.
ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ ఆర్.ఆర్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నాడు. ఎడిటింగ్ టేబుల్ దగ్గరకు 3 గంటల ఫుటేజ్ వచ్చిందట. దాన్ని రెండుగంటల 20 నిమిషాల సినిమాగా కుదించడానికి ఎడిటర్ నానా పాట్లూ పడుతున్నాడు. ఒకవేళ సినిమాని 13తేదీకల్లా సిద్ధం చేసినా... కావల్సినన్ని థియేటర్లు దొరకని పరిస్థితి. ఆంధ్రా, సీడెడ్‌లో ఈ సినిమాకి థియేటర్లు దొరక్కుండా ఓ వర్గం గట్టిగా ప్రయత్నాలు చేస్తోందని టాక్. నైజాంలో, ఓవర్సీస్‌లో ఎన్టీఆర్‌కి బాగానే థియేటర్లు దొరికాయి. సాధారణంగా ఎన్టీఆర్ సినిమా అంటే.. 1000 థియేటర్లలో విడుదల అవ్వాలి. అయితే ఈసారి అన్ని థియేటర్లు దొరకడం కష్టమైన పని. 700 థియేటర్లు దొరకడమే గగనం అయిపోతోంది. అంటే థియేటర్ల విషయంలోనూ ఎన్టీఆర్‌కి గట్టి సవాళ్లు ఎదురవుతున్నాయన్నమాట. ఇలా... నాన్నకు ప్రేమతో విషయంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు ఎన్టీఆర్. వీటన్నింటినుంచి ఎలా బయటపడతాడో చూడాలి.