English | Telugu

ముగ్గురు ఆడ‌వాళ్ల మ‌ధ్య న‌లిగిపోతున్న నితిన్‌..!

త్రివిక్రమ్ సినిమాలో నితిన్ హీరో అన‌గానే అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. ఆ త‌ర‌వాత నితిన్‌రేంజు పెరిగిందేమోలే అని స‌ర్దుకుపోయారు. అ ఆ సినిమా మొద‌ల‌వ్వ‌డం, పూర్త‌వ్వ‌డం.. ఇప్పుడు విడుద‌ల కు సిద్ద‌మ‌వ్వ‌డం.. అలా క్ర‌మం త‌ప్ప‌కుండా జ‌రుగుతున్నాయి. దాంతో పాటు నితిన్ విష‌యంపైనా భ్ర‌మ‌లు విడిపోతున్నాయి. ఈ సినిమా త్రివిక్ర‌మ్ కేవ‌లం స‌మంత కోస‌మే తీశాడ‌ని, ఇదో లేడీ ఓరియెంటెడ్ టైపు స్ర్కిప్ట‌ని ముందునుంచీ ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ట్రైల‌ర్లలోనూ అదే విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఇప్పుడు సెన్సార్ టాక్ కూడా అదే విష‌యం చెబుతోంది. ఈ సినిమా మొత్తం ఆడ‌వాళ్ల డామినేష‌నే క‌నిపించింద‌ట‌. స‌మంత‌, అనుప‌మ‌ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, న‌దియాలు పూర్తిగా డామినేట్ చేసేశార‌ట‌. వాళ్ల ముందు నితిన్ పాత్ర పూర్తిగా నలిగిపోయింద‌ట‌. ఈ సినిమా ర‌షెష్ చూసిన‌వాళ్లు అస‌లు నితిన్ ఈ క్యారెక్ట‌ర్‌కి ఎలా ఒప్పుకొన్నాడ‌బ్బా? అని ఆశ్చ‌ర్య‌పోతున్నార్ట‌. నితిన్ పాత్ర అంత శ‌క్తిమంతంగా ఉంటే,.. ఈ సినిమాని త్రివిక్ర‌మ్ త‌న స్నేహితుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ తోనే తీద్దుడ‌ని, క్యారెక్ట‌ర్లో ద‌మ్ము లేక‌పోవ‌డం వ‌ల్లే అత‌ని అభిమాని నితిన్‌తో స‌ర్దుకుపోయాడ‌ని జోకులు కూడా వేసుకొంటున్నారు. ఈ సినిమా ఎంత హిట్ట‌యినా నితిన్‌కి మాత్రం ఉప‌యోగ‌ప‌డ‌ద‌ని ఖ‌రాఖండీగా చెబుతున్నారు. పాపం.. త్రివిక్ర‌మ్‌ని న‌మ్మినందుకు నితిన్ ఇలా అడ్డంగా మోస‌పోయాడేమో?