English | Telugu

ట‌బు క్యారెక్ట‌ర్‌కు న‌య‌న‌తార ఒప్పుకుంటుందా?

ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే జంట‌గా న‌టించిన హిందీ ఫిల్మ్ 'అంధాధున్‌'. ఇటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్నీ, అటు ప్రేక్ష‌కాద‌ర‌ణ‌నీ పొందిన ఆ సూప‌ర్ హిట్ మూవీలో ట‌బు ఓ కీల‌క పాత్ర‌ను చేశారు. శ్రీ‌రామ్ రాఘ‌వ‌న్ డైరెక్ట‌ర్ చేసిన ఆ క్రైమ్ థ్రిల్ల‌ర్‌లో మొద‌ట అంధుడిగా న‌టిస్తూ, జ‌నాల్ని న‌మ్మిస్తూ, త‌ర్వాత నిజంగానే అంధుడిగా మారే పియానో ప్లేయ‌ర్‌గా ఆయుష్మాన్ న‌ట‌న అంద‌రినీ ఆక‌ట్టుకుంది. తెలుగులో ఆ సినిమా రీమేక్ హ‌క్కుల్ని పొందిన నితిన్ ఆ క్యారెక్ట‌ర్ పోషించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలోనే దాన్ని లాంఛ‌నంగా ప్రారంభించారు కూడా.

సోష‌ల్ మీడియాలో అందులోని కొన్ని క్యారెక్ట‌ర్లు చేసే న‌టుల గురించి ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాంటి వాటిలో లేటెస్ట్ బ‌జ్‌.. ఒరిజిన‌ల్‌లో ట‌బు చేసిన నెగ‌టివ్ క్యారెక్ట‌ర్‌ను సౌత్ లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార‌తో చేయించాల‌ని ఆమెతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడంట‌. ఇప్ప‌టిదాకా ఈ విష‌యంపై ఎలాంటి అధికార ధ్రువీక‌ర‌ణ జ‌ర‌గ‌లేదు. అయితే నెగ‌టివ్ షేడ్స్ ఉన్న ఆ క్యారెక్ట‌ర్ చేయ‌డానికి న‌య‌న్ అంగీక‌రిస్తుందా?.. అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇదివ‌ర‌కు ఆ పాత్ర‌కోసం శివ‌గామి ర‌మ్య‌కృష్ణ‌ను అప్రోచ్ అయ్యార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఇప్ప‌టికీ ఆ క్యారెక్ట‌ర్ ఎవ‌రు చేయ‌నున్నార‌నే విష‌యంలో క్లారిటీ మాత్రం రాలేదు. అలాగే రాధికా ఆప్టే క్యారెక్ట‌ర్‌ను ఎవ‌రు చేస్తార‌నేది కూడా వెల్ల‌డి కాలేదు. నిజానికి ఒరిజిన‌ల్‌లో ట‌బు చేసిన క్యారెక్ట‌ర్‌ను తెలుగులోనూ చేయించాల‌ని ఆమెను సంప్ర‌దించార‌నీ, కానీ ఆమె భారీ రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేయ‌డంతో వెన‌క్కి త‌గ్గార‌నీ ఆన్‌లైన్‌లో ప్ర‌చారంలోకి వ‌చ్చింది. రూ. 3.5 కోట్ల‌కు 'అంధాధున్' రీమేక్ రైట్స్ కొనుగోలు చేసిన నితిన్ దానిని త‌న సొంత బ్యాన‌ర్ శ్రేష్ఠ్ మూవీస్‌పై నిర్మించ‌నున్నాడు. మేర్ల‌పాక గాంధీ డైరెక్ట్ చేయ‌నున్నాడు.