English | Telugu

క‌ల్యాణ్‌రామ్‌.. నిండా మునిగిపోయాడా?

వ‌రుస ఫ్లాపుల‌తో అల్లాడిపోతున్నాడు క‌ల్యాణ్ రామ్. పుష్క‌ర కాల త‌న కెరీర్‌లో క‌ల్యాణ్‌రామ్‌కి వ‌చ్చిన‌వి రెండే రెండు హిట్లు. ఒక‌టి అత‌నొక్క‌డే.. రెండోది ప‌టాస్‌. ఈమధ్య‌లో వ‌చ్చిన సినిమాల‌న్నీ ఫ్లాప‌య్యాయి. క‌నీసం పెట్టుబ‌డిలో స‌గం కూడా తీసుకురాలేదు. అవ‌న్నీ ఒక ఎత్త‌యితే... కిక్ 2 ఫ్లాప్ మ‌రో ఎత్తు. ఈ సినిమాకి పెట్టిన పెట్టుబ‌డి అంతా పోయింది. ఇప్పుడు ఇజం సినిమాకీ దాదాపు అలాంటి రిజ‌ల్టే రాబోతోంది. రూ.25 కోట్ల‌తో తెర‌కెక్కిన సినిమా ఇది. తొలి మూడు రోజుల్లో రూ.6 కోట్లు కూడా తీసుకురాలేదు. ఇక మీద‌ట డ‌బ్బులొస్తాయ‌న్న న‌మ్మ‌కం లేదు. ఇప్ప‌టికీ ఈసినిమాకి శాటిలైట్ అవ్వ‌లేదు. రిలీజ్‌కి ముందు రూ.4 కోట్ల‌కు కొంటామ‌ని టీవీ చాన‌ళ్లు ఆఫ‌ర్ ఇచ్చినా.. క‌ల్యాణ్ రామ్ స్పందించ‌లేద‌ట‌.

ఇప్పుడు ఈ సినిమాని రూ.3 కోట్ల‌కు కూడా కొన‌డం క‌ష్ట‌మంటున్నారు. విడుద‌ల‌కు ముందే రూ.6 కోట్ల న‌ష్టాల‌తో ఈ సినిమాని అమ్మేశాడు క‌ల్యాణ్‌రామ్. ఇప్పుడు ఆ బ‌య్య‌ర్లంతా.. డ‌బ్బులు వెన‌క్కి ఇమ్మ‌ని అడ‌గ‌డం గ్యారెంటీ. సో.. క‌ల్యాణ్ రామ్ క‌ష్టాలు కంటిన్యూ అవ్వ‌బోతున్న‌ట్టే. ఈ ఫైనాన్షియ‌ల్ ట్ర‌బుల్స్‌ని దృష్టిలో ఉంచుకొనే.. ఇక మీద‌ట కొంత‌కాలం వ‌ర‌కూ సినిమా నిర్మాణానికి దూరంగా ఉండాల‌ని డిసైడ్ అయిన‌ట్టు టాక్‌. ఎన్టీఆర్ తో ఓ సినిమా ప్రొడ్యూస్ చేయాల‌నుకొన్నాడు క‌ల్యాణ్ రామ్‌. ఇప్పుడు ఆ ఆలోచ‌న విర‌మించుకొన్నాడ‌ని తెలుస్తోంది.