English | Telugu

ఇక బాలయ్య డ్యాన్సులను చూడలేమా..?

షష్టిపూర్తికి దగ్గరపడుతున్నా.. కుర్ర హీరోల కన్నా స్పీడుగా సినిమాలు చేస్తూ.. ఏడాదికి రెండు సినిమాలను రిలీజ్ చేస్తూ దూసుకెళ్తున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. సంకాంత్రికి జైసింహాగా వచ్చి విజయంతో ఈ ఏడాదిని ప్రారంభించిన బాలయ్య ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్‌‌తో బిజి బిజీగా ఉన్నారు. ఇటువంటి సమయంలో ఆయన ఆరోగ్యం గురించి ఓ వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. బాలయ్య గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్నారని.. మోకాలి చిప్పలు అరిగినట్లు వైద్యులు చెప్పారట.

పెయిన్ కిల్లర్స్‌తో కాలం గడుపుతూ వస్తోన్న ఆయన పైసా వసూల్‌, జైసింహాలలో వేసిన కొత్త రకం స్టెప్పుల కారణంగా.. మోకాలి గాయం మరింత ఎక్కువైందట. ఈ నేపథ్యంలో దానికి సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ బయోపిక్‌లో స్టెప్పులు వేయాల్సిన అవసరం లేదు..దానికి తోడు షూటింగ్‌కు మరింత సమయం ఉండటంతో.. సర్జరీ చేయించుకున్నా కావల్సినంత విశ్రాంతి దొరుకుతుందని బాలయ్య భావిస్తున్నారట. అయితే ఆపరేషన్ ఎప్పుడు చేయించుకుంటారన్నది మాత్రం తెలియాల్సి ఉంది.. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ఒక వేళ నిజమైతే మాత్రం.. బాలయ్య నుంచి మాస్ స్టెప్పులు చూసే అవకాశం నందమూరి అభిమానులకు లేనట్లే..