English | Telugu

అక్కినేని కుర్రాడు షాకిచ్చాడు

‘దోచేయ్‌’ సినిమా ఊహించని ఫలితాన్నివ్వడంతో షాక్‌ తిన్నాడు నాగచైతన్య. ఈ షాక్‌ నుంచి కోలుకోవడానికి టైం పడుతుందేమో అనుకున్నారు కానీ.. అతనే జనాలకు ఓ షాకింగ్‌ న్యూస్‌ ఇచ్చాడు. సడెన్‌గా తమిళ స్టార్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్‌తో సినిమా మొదలుపెట్టేయబోతున్నాడన్నదే ఆ వార్త. చైతూకు తొలి హిట్‌ ఇచ్చింది గౌతమే. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు ‘ఏమాయ చేసావె’ వచ్చింది. మళ్లీ గౌతమ్‌తో చైతూ ఇంకో సినిమా చేయబోతున్నాడని ఇప్పటికే వార్తలొచ్చాయి. ఐతే చందూ మొండేటితో చేయబోయే సినిమా పూర్తయ్యాకే ఇది ఉంటుందనుకున్నారు. కానీ ఇదే ముందు మొదలవుతోంది.

శుక్రవారమే ఈ సినిమాకు కొబ్బరి కాయ కొట్టబోతున్నారట. ప్రస్తుతం తమిళంలో శింబుతో తీస్తున్న సినిమానే తెలుగులో చైతూ హీరోగా గౌతమ్‌ చేయబోతున్నాడని సమాచారం. ఇలా తమిళంలో ఒక హీరోతో, తెలుగులో ఒక హీరోతో ఒకే సినిమాను రెండు వెర్షన్లు తీయడం గౌతమ్‌కు కొత్తేం కాదు. ఘర్షణ, ఏమాయ చేసావె, ఎటో వెళ్లిపోయింది మనసు అలాగే తీశాడు. ఇప్పుడు చైతూ సినిమా కూడా అలాంటిదే. శింబుతో ఇప్పటికే సగం షూటింగ్‌ పూర్తి చేసేసిన గౌతమ్‌.. చెన్నైలో 45 రోజుల పాటు ఏకధాటిగా జరిగే షూటింగ్‌తో చైతూ సినిమాను ఫినిష్‌ చేసేస్తాడట. ఈ సినిమాకు ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీత దర్శకుడు. హీరోయిన్‌ ఎవరన్నది వెల్లడి కాలేదు.