English | Telugu

'మెగా 154'కి ఓ హైలైట్.. ఐట‌మ్ సాంగ్!

మెగాస్టార్ చిరంజీవి - రాక్ స్టార్ దేవి శ్రీప్ర‌సాద్ ది చార్ట్ బ‌స్ట‌ర్ కాంబినేష‌న్. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ఇప్ప‌టివ‌ర‌కు `శంక‌ర్ దాదా ఎంబీబీఎస్`, `అంద‌రివాడు`, `శంక‌ర్ దాదా జిందాబాద్`, `ఖైదీ నంబ‌ర్ 150` చిత్రాలు రాగా.. అన్నీ కూడా మ్యూజిక‌ల్ గా మెప్పించాయి. `అంద‌రివాడు`లో మిన‌హాయిస్తే.. మిగిలిన మూడు సినిమాల్లోనూ ఐట‌మ్ సాంగ్స్ మెగాభిమానుల‌ను ఉర్రూత‌లూగించాయి.

`శంక‌ర్ దాదా ఎంబీబీఎస్`లో ``నా పేరే కాంచ‌న‌మాల‌``, `శంక‌ర్ దాదా జిందాబాద్`లో ``ఆక‌లేస్తే అన్నం పెడ‌తా``, `ఖైదీ నంబ‌ర్ 150`లో ``ర‌త్తాలు ర‌త్తాలు``.. ఇలా సినిమా ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా ఈ ప్ర‌త్యేక గీతాల‌న్నీ చార్ట్ బ‌స్ట‌ర్స్ గా నిలిచాయి.

కాగా, త్వ‌ర‌లో చిరు - డీఎస్పీ కాంబోలో మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. `మెగా 154` అనే వ‌ర్కింగ్ టైటిల్ తో బాబీ (కె.ఎస్‌. ర‌వీంద్ర‌) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ మాస్ మ‌సాలా సినిమాలోనూ మాంచి స్పెష‌ల్ సాంగ్ కి స్కోప్ ఉంద‌ట‌. ఇప్ప‌టికే దేవి ట్యూన్ కూడా సిద్ధం చేశాడ‌ని బ‌జ్. అంతేకాదు.. ఈ ప్ర‌త్యేక గీతం సినిమాకి ఓ హైలైట్ గా నిలుస్తుంద‌ని అంటున్నారు. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

కాగా, మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తున్న `మెగా 154`లో చిరు ఓ అండ‌ర్ క‌వ‌ర్ పోలీస్ గా క‌నిపిస్తార‌ని ఇన్‌సైడ్ టాక్.