English | Telugu

ప‌దిహేనేళ్ల త‌ర్వాత‌ త్రిషతో మ‌హేశ్‌ రొమాన్స్?

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు స‌ర‌స‌న క‌నువిందు చేసిన క‌థానాయిక‌ల్లో చెన్నై పొన్ను త్రిష ఒక‌రు. `అత‌డు`(2005)లో తొలిసారిగా అల‌రించిన ఈ జోడీ.. ఆపై `సైనికుడు` (2006)లోనూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. క‌ట్ చేస్తే.. ప‌ద‌హారేళ్ళ త‌రువాత ఈ ఇద్ద‌రు ముచ్చ‌ట‌గా మూడోసారి జ‌ట్టుక‌ట్ట‌నున్నార‌ట‌.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో `అత‌డు`, `ఖ‌లేజా` (2010) త‌రువాత మ‌హేశ్ మ‌రోసారి న‌టించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నున్న ఈ సినిమాలో ఇద్ద‌రు నాయిక‌ల‌కు స్థాన‌ముంద‌ని స‌మాచారం. వారిలో ఒక‌రిగా `బుట్ట‌బొమ్మ‌` పూజా హెగ్డే న‌టించ‌బోతోంద‌ని ప్ర‌చారం సాగుతోంది.

మ‌రో నాయిక‌గా ప‌లువురి పేర్లు వినిపించినా.. ఇప్పుడా పాత్ర సీనియ‌ర్ హీరోయిన్ త్రిష‌కి ద‌క్కింద‌ని స‌మాచారం. అభిన‌యానికి ఆస్కార‌మున్న పాత్ర కావ‌డంతో త్రిష కూడా వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని బ‌జ్. త్వ‌ర‌లోనే మ‌హేశ్ - త్రివిక్ర‌మ్ థ‌ర్డ్ జాయింట్ వెంచ‌ర్ లో త్రిష ఎంట్రీపై క్లారిటీ రానున్న‌ది. మ‌రి.. `అత‌డు` అనంత‌రం మ‌హేశ్ - త్రిష - త్రివిక్ర‌మ్ త్ర‌యం మ‌రోమారు మెస్మ‌రైజ్ చేస్తుందేమో చూడాలి.

కాగా, ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ నిర్మించ‌నుండ‌గా.. యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ బాణీలందించ‌నున్నాడు. వ‌చ్చే ఏడాది వేస‌విలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెర‌పైకి రానుంది.