English | Telugu

ఫస్ట్ కాపీ కొట్టాలనుకుంది త్రివిక్రమ్ కాదట..?

లార్గోవించ్.. ఎప్పుడో 2008లో ఫ్రెంచ్‌ భాషలో రిలీజైన ఈ మూవీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది. ఇందుకు కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "అజ్ఞాతవాసి" సినిమాకు కావలసిన ముడిసరుకును ఈ సినిమాలోంచే తీసుకున్నారట త్రివిక్రమ్. ఇప్పుడు ఇదే వివాదానికి కారణమైంది. తమ అనుమతి లేకుండా లార్గోవించ్‌ కథను కాపీకొట్టారంటూ ఈ చిత్ర దర్శకుడు ఆరోపించగా.. ఈ మూవీ రైట్స్ పొందిన టీ. సిరీస్‌ ఏకంగా లీగల్ నోటీసులు పంపేదాకా వెళ్లింది వ్యవహారం.

10 నుంచి 15 కోట్లు ఇస్తే గానీ వాళ్లు వదిలేలా కనిపించడం లేదు. ఒక చిన్న కాపీ ఇంత రచ్చ చేస్తుందా అనుకునే లోపు.. లార్గోవించ్‌ మీద చాలా మంది తెలుగు డైరెక్టర్ల కన్ను పడినట్లు ఫిలింనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మహేశ్‌తో కొరటాల తీస్తోన్న "భరత్‌ అను నేను"లో ఈ సినిమాకు సంబంధించిన చిన్న లైన్ ఒకటి ఉందట. అసలు వీరిద్దరి కన్నా ముందు లార్గోవించ్‌ గురించి మొదట తెలుసుకున్నాడట సురేందర్ రెడ్డి.

కొన్నాళ్ల క్రితం అల్లు అర్జున్ కోసం ఈ మూవీ లైన్‌తో మంచి కథను తయారుచేసి బన్నీకి వినిపిద్దామనుకున్నాడట. అయితే అప్పటికే సుకుమార్ తీస్తోన్న "నాన్నకు ప్రేమతో" కూడా లార్గోవించ్‌లోంచి పుట్టిన కథేనని భావించి సురేందర్ రెడ్డి తన ప్రయత్నాలు ఆపేశాడట. అయితే సుకుమార్ సొంతంగా స్క్రిప్ట్ రాసుకున్నాడట. లేదంటే సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఆ కథ ఎప్పుడో సినిమాగా వచ్చేది. కానీ అప్పుడు సినిమా తీయకపోవడం మంచికే జరిగిందని సన్నిహితులతో అన్నాడట సురేందర్. నిజమే మరి.. లేదంటే త్రివిక్రమ్ ప్లేస్‌లో సురేందర్ రెడ్డి ఇప్పుడు సినీ జనాల చేతికి చిక్కివాడు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు.