English | Telugu

ఖైదీ తో న‌ష్టాలు త‌ప్ప‌వా??

ఓ వైపు రికార్డులు బ‌ద్ద‌లు కొట్టుకొంటూ వెళ్తోంది ఖైదీ నెం.150. కేవ‌లం ఆరు రోజుల్లోనే వంద కోట్ల మైలు రాయిని అందుకొంది. టాలీవుడ్‌లో వంద కోట్ల చిత్రాలెన్ని ఉన్నా - అతి త‌క్కువ స‌మ‌యంలో ఆ మైలు రాయిని అందుకొన్న సినిమా ఖైదీ నెం.150నే. చిరు 150వ సినిమా క‌చ్చితంగా రూ.130 కోట్ల గ్రాస్‌ని వ‌సూలు చేయ‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. అయితే చిరు సినిమా వంద కోట్లు దాటినా.. ఇప్ప‌టి వ‌ర‌కూ చిత్ర‌బృందం అధికారిక ప్ర‌క‌ట‌నేం చేయ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. ఈ సినిమాకి భారీ వ‌సూళ్లు వ‌స్తున్నా - కొన్ని ఏరియాల్లో ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించ‌లేద‌ని తెలుస్తోంది. సంక్రాంతి సీజ‌న్ అయిపోయింది.

మునుప‌టిలా వ‌సూళ్లుండ‌వు. ఇప్ప‌టికే చాలా థియేట‌ర్లు ఖాళీ అయిపోయాయి. ఈ ద‌శ‌లో ఆయా ఏరియాల్లో లాభాల మాట దేవుడెరుగు.. స్వ‌ల్పంగా న‌ష్టాలు చ‌వి చూసినా ఆశ్చ‌ర్యం లేదు. ఎందుకంటే ఖైదీ నెం.150 బిజినెస్ బాహుబ‌లి రేంజులో జ‌రిగింది. సినిమాని ఊహించ‌న‌దానికంటే ఎక్కువ మొత్తాల‌కు కొనేశారు బ‌య్య‌ర్లు. అందుకే స్వ‌ల్ప న‌ష్టాల్ని చ‌విచూడాల్సివ‌స్తోంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఖైదీ విడుద‌లై వారం అయినా ఓవ‌ర్సీస్ లో ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించ‌లేదు. ఈవారం కూడా సినిమాలేం లేక‌పోవ‌డం ఖైదీకి క‌లిసొచ్చే అంశం. దాన్ని చిరు సినిమా ఎంత వ‌ర‌కూ క్యాష్ చేసుకొంటుందో చూడాలి.