English | Telugu

చిరు... ఈ వ‌సూళ్ల‌లో నిజ‌మెంత‌??

మెగా రీ ఎంట్రీ కోసం తొమ్మిదేళ్ల పాటు నిరీక్షించిన అభిమానుల‌కు చిరు అదిరిపోయే కానుక ఇచ్చాడు. త‌న రీ ఎంట్రీ సినిమానే వంద కోట్ల చిత్రంగా మ‌ల‌చి... తానెప్ప‌టికీ మెగా స్టారే అనిపించుకొన్నాడు. తొలి రోజే ఆల్ టైమ్ ఇండ్ర‌స్ట్రీ రికార్డుని బ‌ద్ద‌లు కొట్టిన చిరు... 5 రోజులు ముగిసేనాటికి త‌న సినిమాని వంద కోట్ల క్ల‌బ్ లో చేర్చాడు. 5 రోజుల‌కు గానూ ఖైదీ నెం.150 దాదాపుగా 115 కోట్ల గ్లాస్ సాధించింది. మొత్తానికి రూ.72 కోట్ల షేర్ సంపాదించింది. ఓవ‌ర్సీస్‌లో రూ.15 కోట్లకు పైగా తెచ్చుకొన్న చిరు సినిమా.. నైజాంలో రూ.13 కోట్లు సంపాదించింది.

ఈస్ట్‌, వెస్ట్‌, కృష్ణా, గుంటూరు... ఇలా అన్నిచోట్లా రికార్డు క‌ల‌క్ష‌న్ల‌తో దూసుకుపోతోంది. ఈ లెక్క‌లు చూసి చిరు అభిమానులు సంబ‌రాల్లో మునిగిపోతుంటే... మ‌రో వైపు నాన్ మెగా ఫ్యాన్స్ ఈ లెక్క‌ల‌న్నీ త‌ప్పు... అంటూ వాదిస్తున్నారు. తొలిరోజు వ‌సూళ్ల వ‌ర‌కూ ఓకే అని... ఆ రోజున ఉన్న హైప్ ఆ త‌ర‌వాత లేద‌ని, గౌత‌మి పుత్ర సినిమా వ‌చ్చాక‌... ఖైదీ వ‌సూళ్లు దారుణంగా ప‌డిపోయాయ‌ని, రెండో రోజు.. మూడో రోజు మూడొంతుల వ‌సూళ్లు డ్రాప్ అయిపోయాయ‌ని ఖైదీ వ‌సూళ్లు గ్రాస్ ప‌రంగా రూ.80 కోట్ల ద‌గ్గ‌రే ఉన్నాయ‌ని... మిగిలిన లెక్క‌ల‌న్నీ ఫేక్ అని గ‌ట్టిగా చెబుతున్నారు.

అయితే ట్రేడ్ పండితులు, క‌ర‌ణ్ ఆద‌ర్శ్‌లాంటివాళ్లు ఖైదీ సినిమా ప్ర‌భంజ‌నాన్ని అంకెల్లో చూపిస్తూనే ఉన్నారు. చిరు వ‌ర్గీయులు చెప్పిన‌ట్టు ఈ సినిమా రూ.115 కోట్ల గ్రాస్ సంపాదించ‌క‌పోయినా.. వంద కోట్ల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంద‌న్న‌ది వాస్త‌వం. వంద కోట్ల క్ల‌బ్‌లో చేర‌డం ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు క‌దా? పైగా పొలిటిక‌ల్‌గా ఇమేజ్ దారుణంగా ప‌డిపోయిన త‌ర‌వాత‌... తొమ్మిదేళ్లు గ్యాప్ తీసుకొని చేసిన సినిమాతో... వంద కోట్లు కొట్ట‌డం నిజంగానే అనిత‌ర సాధ్య‌మైన విష‌యం. ఈ విష‌యంలో చిరు నిజంగా గ్రేటే!