English | Telugu

ప‌వ‌న్‌కి ప్రియురాలు.. చిరుకి చెల్లెలు..?

ప్ర‌స్తుతం బిగ్ టికెట్ ఫిల్మ్స్ తో బిజీగా ఉన్న తార‌ల్లో కేర‌ళ‌కుట్టి కీర్తి సురేశ్ ఒక‌రు. మాలీవుడ్ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ భారీ బ‌డ్జెట్ మూవీ `మ‌ర‌క్క‌ర్ః అర‌బిక్ క‌డలింటే సింహం`లో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించిన కీర్తి.. ఆ సినిమా విడుద‌ల కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. అలాగే సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుకి జంట‌గా `స‌ర్కారు వారి పాట‌`లో న‌టిస్తున్న ఈ నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్ర‌స్.. మ‌రోవైపు త‌లైవా ర‌జినీకాంత్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ `అణ్ణాత్తే`లోనూ న‌టిస్తోంది. `అణ్ణాత్తే`లో ర‌జినీకి కూతురిగా ఆమె క‌నిపిస్తుంద‌ని స‌మాచారం.

ఇదిలా ఉంటే.. మ‌రో భారీ బ‌డ్జెట్ మూవీలోనూ న‌టించే అవ‌కాశం ద‌క్కింద‌ట కీర్తికి. ఆ సినిమా మ‌రేదో కాదు.. త్వ‌ర‌లో ప‌ట్టాలెక్క‌నున్న `వేదాళ‌మ్` రీమేక్. మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ సినిమాలో చెల్లెలి పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వబోతోంద‌ట కీర్తి. మాతృక‌లో ల‌క్ష్మీ మీన‌న్ ఈ పాత్ర‌ను పోషించింది. వాస్త‌వానికి ఈ క్యారెక్ట‌ర్ కోసం తొలుత సాయిప‌ల్ల‌వి పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. క‌ట్ చేస్తే.. ఇప్పుడ‌దే వేషానికి కీర్తి ఎంపికైంద‌ని ప్ర‌స్తుతం ప్ర‌చారం సాగుతోంది. మ‌రి.. ఈ క‌థ‌నాల్లో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. మూడేళ్ళ క్రితం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన `అజ్ఞాత‌వాసి`లో అత‌నికి ప్రియురాలిగా క‌నిపించింది కీర్తి. ఇప్పుడేమో చిరుకి చెల్లెలిగా ఆమె న‌టించ‌బోతుండ‌డం విశేష‌మ‌నే చెప్పాలి.