English | Telugu

కాట‌మ‌రాయుడుకి క‌ష్టాలు త‌ప్ప‌వా??

కాట‌మ‌రాయుడు చుట్టూ ఓ కాంట్ర‌వ‌ర్సీ బిగుసుకుపోతోంది. ఈ సినిమానీ, అటు ప‌వ‌న్ క‌ల్యాణ్ నిజాయ‌తీనీ ఇర‌కాటంలో ప‌డేస్తోంది. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ వ‌ల్ల న‌ష్ట‌పోయిన డిస్టిబ్యూట‌ర్లు.. ఇప్పుడు కాట‌మ‌రాయుడుని అడ్డుకొనేందుకు పెద్ద స్కెచ్ వేస్తున్న‌ట్టు ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల భోగ‌ట్టా. గ‌త వేస‌వికి విడుద‌లైన సర్దార్ గబ్బర్ సింగ్ అట్ట‌ర్ ఫ్లాప్ అవ్వ‌డంతో.. ఆ సినిమాని భారీ రేట్లు పెట్టి కొన్న పంపిణీదారులు రోడ్డుమీద ప‌డ్డారు.

వాళ్ల‌ని ఆదుకొనే ఉద్దేశంతోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ కాట‌మ‌రాయుడు సినిమాని మొద‌లెట్టాడ‌న్న వార్త‌లొచ్చాయి. కాట‌మ‌రాయుడు ఏరియాల రైట్స్‌.. సర్దార్ కొని న‌ష్ట‌పోయిన వాళ్ల‌కే ఇవ్వాల‌ని ప‌వ‌న్ ఫిక్స‌య్యాడ‌ని చెప్పుకొన్నారు. అయితే ఇప్పుడు క‌థ అడ్డం తిరిగింది. కాట‌మ‌రాయుడుకి రోజు రోజుకీ హైప్ పెరుగుతున్న నేప‌థ్యంలో... ఎవ‌రు ఎక్కువ రేటు ఇస్తే వాళ్ల‌కే సినిమా అమ్మ‌డం ప్రారంభించింది చిత్ర‌బృందం. దాంతో.. స‌ర్దార్ డిస్టిబ్యూట‌ర్లు రివ‌ర్స్ అయ్యారు. ముందు మాకు అమ్మిన త‌ర‌వాతే.. మిగిలిన వాళ్ల‌కు ఇవ్వాలి అంటూ .. కాట‌మ‌రాయుడు బిజినెస్‌కి అడ్డు త‌గులుతున్నారు.

స‌ర్దార్‌తో రెండు కోట్లు న‌ష్ట‌పోయిన కృష్ణాజిల్లా పంపిణీదారుడు సంప‌త్ రాజ్‌... మీడియా ముందుకు రావ‌డంతో ఈ కాంట్ర‌వ‌ర్సీ మొద‌లైంది. ఇది ఇక్క‌డితో ఆగేలా క‌నిపించ‌డం లేదు. స‌ర్దార్ వ‌ల్ల న‌ష్ట‌పోయిన వాళ్లంతా ఏక‌మై.. ప‌వ‌న్‌ని క‌లుసుకొని త‌మ గోడు చెప్పుకోవాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఒక‌వేళ ప‌వ‌న్ కూడా చేతులెత్తేస్తే.. కాట‌మ‌రాయుడు సినిమా విడుద‌ల కాకుండా అడ్డుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నార్ట‌. ఇది నిజంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌కి చేదువార్తే. మార్చి 24న కాట‌మ‌రాయుడుని విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈలోగా ఈ వ్య‌వ‌హారానికి శుభం కార్డు ప‌డాలి. లేదంటే కాట‌మ‌రాయుడికి క‌ష్టాలు త‌ప్ప‌వు.