English | Telugu
మరో కార్తి దర్శకుడితో కమల్ హాసన్ సినిమా!?
Updated : Mar 25, 2022
కోలీవుడ్ స్టార్ కార్తి నటించిన యాక్షన్ థ్రిల్లర్ `ఖైదీ`తో దర్శకుడిగా ఎనలేని గుర్తింపుని పొందాడు లోకేశ్ కనకరాజ్. ఆపై తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ తో `మాస్టర్` తీసి మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న లోకేశ్.. ప్రస్తుతం లోక నాయకుడు కమల్ హాసన్ తో `విక్రమ్` రూపొందిస్తున్నాడు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, మాలీవుడ్ స్టార్ ఫహద్ ఫాజిల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్.. ఈ ఏడాది వేసవి కానుకగా జూన్ 3న తమిళంతో పాటు పలు భాషల్లో సందడి చేయనుంది. ఈ సినిమాపై కమల్ అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.
ఇదిలా ఉంటే, తాజాగా కమల్ హాసన్ మరో టాలెంటెడ్ కెప్టెన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆ వివరాల్లోకి వెళితే.. గతంలో కార్తి కాంబినేషన్ లో `కొంబన్` అనే విలేజ్ డ్రామా తెరకెక్కించిన ఎం. ముత్తయ్య.. ఇటీవల కమల్ ని సంప్రదించి ఓ ఆసక్తికరమైన సబ్జెక్ట్ వినిపించాడట. అది నచ్చడంతో కమల్ వెంటనే ఓకే చెప్పారని సమాచారం. అంతేకాదు.. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కమల్ హాసన్ పల్లెటూరి వ్యక్తిగా కనిపించనున్నారని బజ్. త్వరలోనే కమల్ - ముత్తయ్య కాంబినేషన్ మూవీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.