English | Telugu

దివ్యాంగుడి పాత్రలో తారక్.. 'పెద్ది' కోసం పెద్ద రిస్క్!

'ఆర్ఆర్ఆర్' మూవీతో నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని, సక్సెస్ జోష్ లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. నెక్స్ట్ మూవీని తనకి 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ లో పట్టాలెక్కే అవకాశముంది. ఆ తర్వాత 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నట్లు కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో తారక్ దివ్యాంగుడి పాత్రలో కనిపించనున్నట్లు తాజాగా షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది.

ఈ జెనరేషన్ బెస్ట్ యాక్టర్స్ లో తారక్ ముందు వరుసలో ఉంటాడు. ఏ పాత్ర పోషించినా అందులో పరకాయప్రవేశం చేస్తాడు. ఆర్ఆర్ఆర్ లోనూ భీమ్ పాత్రలో జీవించాడు. ముఖ్యంగా కొమురం భీముడో సాంగ్ తో కట్టి పట్టేశాడు. ఇప్పుడు అంతకుమించిన మించిన పాత్రతో మెప్పించడానికి సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది.

కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కే 'పెద్ది' అనే స్పోర్ట్స్ డ్రామాకి తారక్ గ్రీన్ ఇచ్చినట్లు ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో తారక్ కొన్ని సీన్స్ లో విక‌లాంగుడిలా కనిపించనున్నాడని టాక్. మొదట దీనిని ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారోనని సందేహించిన తారక్.. కథ బాగా నచ్చడంతో పాటు, ఛాలెంజింగ్ రోల్ కావడంతో ఓకే చెప్పాడట. సినిమాకి ఆ ఎపిసోడ్ కీలకం కావడంతో బుచ్చిబాబు కూడా తారక్ ని కన్విన్స్ చేసినట్లు తెలుస్తోంది. 'టెంపర్' సినిమా తర్వాత పాత్రల ఎంపికలో వేరియేషన్స్ చూపిస్తున్న తారక్.. ఇప్పుడేకంగా దివ్యాంగుడి పాత్రలో నటించనున్నాడని న్యూస్ వినిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది.