English | Telugu

ఎన్టీఆర్‌‌ నత్తిగా మాట్లాడాడని.. చెర్రీ చెవిటి వాడయ్యాడా..?

ఒక హీరో.. ఒక హీరోయిన్.. ఇద్దరి మధ్య లవ్.. ఓ 6 పాటలు.. 5 పాటలు.. కామెడీ ట్రాక్.. నాలుగు సెంటిమెంట్ సీన్లు.. నిన్న మొన్నటి వరకు తెలుగు సినిమా అంటే ఇదే. ఇదే ఫార్మాట్‌ను జనంపై రుద్ది రుద్ది పండగ చేసుకోమనే వారు. లేదు దర్శకులు ఏదైనా కొత్తగా ట్రై చేద్దామనుకున్నా.. ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయిన హీరోలు బయటకు వచ్చేవారు కాదు. అయితే యంగ్‌ డైరెక్టర్స్ ఎంట్రీతో రాను రాను ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. ఒకరిని చూసి మరొకరు కొత్తగా ట్రై చేస్తున్నారు. ఎందుకంటే సినీరంగంలో పోటీ ఎక్కువ.

ప్రతిసారి కొత్తదనం చూపించాలి.. కేవలం కథలోనే కాదు.. గెటప్‌లో.. బాడీ లాంగ్వేజీలో సైతం వైవిధ్యం చూపించాలి. నాగార్జున ఊపిరి సినిమా మొత్తం వీల్‌చైర్‌లోనే కూర్చోవడం.. అనుష్క సైజ్ జీరో కోసం లావెక్కడం.. ఎన్టీఆర్ నత్తితో మాట్లాడటం ఇదంతా కొత్తదనం కోసమే. తెలుగు హీరోలంతా ఒక దారిలో నడుస్తుంటే.. మెగా హీరోలంతా వేరే దారిలో నడుస్తారనేది ఇండస్ట్రీలో అనుకునే మాట. తమకు బాగా అచ్చొచ్చిన మాస్ కమర్షియల్ ఫార్ములాతోనే సినిమాలను చేస్తూ వచ్చిన మెగా వారసులు.. ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారు.

నా పేరు సూర్య కోసం బన్నీ ఎగ్రెసివ్‌నెస్ ఉన్న ఆర్మీ ఆఫీసర్‌గా ట్రై చేస్తుండగా.. రంగస్థలంలో చెర్రీ చెవిటివాడుగా కనిపిస్తున్నాడు. ఇంతవరకు చరణ్‌కు స్టార్ హీరో అన్న పేరు తప్ప నటుడిగా మంచి మార్కులు పడ్డ దాఖలాలు లేవు. అందుకే ఈ సారి తన నటవిశ్వరూతపం చూపించాలని చెర్రీ తపన పడుతున్నాడు. రీసెంట్‌గా రిలీజైన రంగస్థలం టీజర్ చూస్తే మెగా పవర్ స్టార్ కష్టం తెలుస్తుంది. మొత్తానికి తెలుగు హీరోలు కొత్తదనం కోసం ప్రయత్నించడం తెలుగు సినిమాకు మంచిదేగా.