English | Telugu

నానితో `ఇస్మార్ట్` బ్యూటీ?

నేచుర‌ల్ స్టార్ నాని చేతిలో ప్ర‌స్తుతం మూడు చిత్రాలున్నాయి. ఆ సినిమాలే.. `ట‌క్ జ‌గ‌దీష్`, `శ్యామ్ సింగ రాయ్`, `అంటే.. సుంద‌రానికీ!`. వీటిలో `ట‌క్ జ‌గ‌దీష్` ఆగ‌స్టులో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా.. `శ్యామ్ సింగ రాయ్` చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఇక `అంటే.. సుంద‌రానికీ!` మ‌రికొద్ది రోజుల్లో ప‌ట్టాలెక్కేందుకు ముస్తాబ‌వుతోంది.

ఇదిలా ఉంటే.. నాని తాజాగా మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని టాక్. శ్రీ‌కాంత్ అనే నూత‌న ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు. సుధాక‌ర్ చెరుకూరి నిర్మాత‌. కాగా, ఈ చిత్రంలో నానికి జంట‌గా `ఇస్మార్ట్ శంక‌ర్` హీరోయిన్స్ లో ఒక‌రైన నిధి అగ‌ర్వాల్ న‌టించే అవ‌కాశ‌ముంద‌ని వినికిడి. త్వ‌ర‌లోనే నాని - శ్రీ‌కాంత్ సినిమాలో నిధి ఎంట్రీపై క్లారిటీ రానున్న‌ది. మ‌రి.. ఫ‌స్ట్ టైమ్ జ‌ట్టుక‌ట్ట‌నున్న నాని - నిధి.. జంట‌గా ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటారో చూడాలి. ఈ ఏడాది చివ‌ర‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళ‌నుంది.

కాగా, ప్ర‌స్తుతం నిధి చేతిలో `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు`, `హీరో` చిత్రాలున్నాయి. `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు`లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి జంట‌గా న‌టిస్తున్న మిస్ అగ‌ర్వాల్.. `హీరో`లో సూప‌ర్ స్టార్ మహేశ్ బాబు మేన‌ల్లుడు గ‌ల్లా అశోక్ కి జోడీగా యాక్ట్ చేస్తోంది. మ‌రోవైపు పేరు నిర్ణ‌యించ‌ని ఓ త‌మిళ సినిమాలోనూ నిధి న‌టిస్తోంది.