English | Telugu

మూడేళ్లుగా ఒకే సినిమా.. ఆర్థిక ఒత్తిడిలో కొర‌టాల శివ‌?!

భారీ బ‌డ్జెట్ సినిమాల విడుద‌ల‌లు ప‌దే ప‌దే పోస్ట్‌పోస్ అవుతుండ‌టంతో ప‌లువురు నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు ఆర్థిక క‌ష్టాల్లో చిక్కుకుంటున్నార‌ని ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఎప్పుడు త‌మ సినిమా రిలీజ‌వుతుందో అర్థంకాని ప‌రిస్థితి ఉండ‌టంతో వారంతా త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

అలాంటి వారికి ఒక ఉదాహ‌ర‌ణ‌గా కొర‌టాల శివ పేరు వినిపిస్తోంది. ఆయ‌న చిరంజీవిని టైటిల్ రోల్‌లో చూపిస్తూ 'ఆచార్య' మూవీని తీస్తున్నాడు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిరంజ‌న్‌రెడ్డితో క‌లిసి కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్‌పై 'ఆచార్య‌'ను నిర్మిస్తున్న రామ్‌చ‌ర‌ణ్‌, ఇందులో ఓ కీల‌క పాత్ర‌ను కూడా చేస్తున్నాడు.

ఎన్న‌డో రెండేళ్ల క్రితం షూటింగ్ ప్రారంభ‌మైన ఈ సినిమాకు కొవిడ్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ప‌లుమార్లు ఆటంకాలు ఏర్ప‌డ్డాయి. ఇప్ప‌టికీ ఈ సినిమా వ‌ర్క్‌ కంప్లీట్ కాలేదు. దీంతో ఈ సినిమా నిర్మాణానికి తీసుకున్న ఫైనాన్స్‌కు వ‌డ్డీలు విప‌రీతంగా పెరిగిపోయాయంటున్నారు.

అందిన స‌మాచారం ప్ర‌కారం ఈ ప్రాజెక్టుకు చిరంజీవితో పాటు రామ్‌చ‌ర‌ణ్ కూడా రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్నాడు. నిర్మాత నిరంజ‌న్‌రెడ్డికి ప్రాఫిట్స్ అంద‌జేస్తాన‌ని చ‌ర‌ణ్ ప్రామిస్ చేశాడంట‌. కాగా, ఇంత‌వ‌ర‌కూ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌కు రెమ్యూన‌రేష‌న్ అంద‌లేదంట‌. 'భ‌ర‌త్ అనే నేను' (2018) సినిమా త‌ర్వాత మ‌రో హీరోతో సినిమా చేసే అవ‌కాశం ఉన్నా చిరంజీవితో సినిమా చెయ్యాల‌ని చాలా కాలం వెయిట్ చేశాడు కొర‌టాల‌. ఆ త‌ర్వాత 'ఆచార్య' మొద‌లైనా, ప‌దే ప‌దే షూటింగ్ ఆగిపోతూ రావ‌డంతో.. ఇప్ప‌టికే మూడేళ్లు గ‌డిచిపోయాయి.

మ‌రోవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భారీ బ‌డ్జెట్ సినిమాల‌కు ఉన్న ప్ర‌తికూల స‌మ‌స్య‌ల వ‌ల్ల 'ఆచార్య‌'ను ఎప్పుడు రిలీజ్ చేయాల‌నే దానిపై ఇంత‌దాకా ఓ అభిప్రాయానికి రాలేక‌పోతున్నారు. టికెట్ ధ‌ర‌లు పెంచే అవ‌కాశం లేక‌పోయినా, క‌నీసం థియేట‌ర్ల‌లో 100 శాతం ఆక్యుపెన్సీకి అవ‌కాశం ఇస్తే, సినిమాని రిలీజ్ చేయొచ్చ‌ని చూస్తున్నారు. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం దీనిపై ఇంత‌దాకా త‌న నిర్ణ‌యం వెలువ‌రించ‌లేదు. పైగా అద‌న‌పు షోలు, ప్రివ్యూ షోల‌కు కూడా అనుమ‌తి లేద‌ని చెప్పేస్తోంది.

దీంతో భారీ ధ‌ర‌ చెల్లించి ఈ సినిమాని కొంటే తాము తీవ్రంగా న‌ష్ట‌పోతామ‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు డిస్ట్రిబ్యూట‌ర్లు. ఇలా ప‌లు స‌మ‌స్య‌లు చుట్టుముట్ట‌డంతో నిర్మాత‌లు భారీగా ఆదాయాన్ని కోల్పోయే ప్ర‌మాదం క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే 'ఆచార్య' డిజిట‌ల్‌, శాటిలైట్‌, డ‌బ్బింగ్ రైట్స్‌ను అమ్మేశారు. ఒక్క థియేట‌ర్ హ‌క్కులు మాత్ర‌మే పెండింగ్‌లో ఉన్నాయి. ఫైన‌ల్‌గా కొర‌టాల శివ ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడ‌నే టాక్ న‌డుస్తోంది.