English | Telugu

ఫ్లాప్ సినిమాకే ప‌బ్లిసిటీ ఎక్కువ‌

ఆగిపోయే పెళ్లికి బాజాలెక్కువ అన్న‌ట్టు.. తెలుగు సినీ ఇండ్ర‌స్ట్రీలో.. ఫ్లాప్ సినిమాల‌కే ప‌బ్లిసిటీ ఎక్కువ‌గా క‌నిపిస్తుంటుంది. మా సినిమా హిట్ట‌య్యిందోచ్ అంటూ నానా హంగామా చేస్తారు. సినిమా విడుద‌లైన రోజే స‌క్సెస్ మీట్ పెడుతున్న చిత్ర‌విచిత్రాలు చూస్తూనే ఉన్నాం. ఈవారం కూడా నాలుగు సినిమాలొచ్చాయి. రామ్‌లీల‌, భ‌మ్‌భోలేనాథ్‌, పిశాచి, మ‌గ‌మ‌హారాజు.. థియేట‌ర్ల‌లో వాలిపోయాయి. అయితే వీటిలో ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన సినిమా ఒక్క‌టంటే ఒక్క‌టీ లేదు.కానీ ప‌బ్లిసిటీ మాత్రం పిచ్చ‌పిచ్చ‌గా చేస్తున్నారు. రోజుకో స‌క్సెస్ మీట్ పెట్టి హ‌డావుడి చేస్తున్నారు. మ‌రోవైపు ఆయా సినిమాల థియేట‌ర్లు జ‌నాలు లేక బోసిగా క‌నిపిస్తున్నాయి. రామ్ లీల టీమ్ అయితే.. `చిన్న సినిమాల్లో అతి పెద్ద విజ‌యం` అంటూ బిల్డ‌ప్పులిస్తోంది. `భ‌మ్‌బోలేనాథ్‌` త‌క్కువ తిన‌లేదు. మా సినిమా మిగిలిన భాషల్లోనూ రీమేక్ చేస్తున్నారు తెలుసా.. అంటూ కొత్త‌ర‌కం మార్కెట్ స్ట్రాట‌జీని మొద‌లెట్టేశారు. పిశాచి చూసి థియేట‌ర్లో జ‌నం ఊగిపోతున్నార‌ట‌. ఇలా ఉంది ప్రెస్ మీట్లో సినిమా వాళ్ల ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు. ప్రేక్ష‌కులు ఫ్లాప్ అనే ముద్ర వేసేశాక‌.. ఎంత ప‌బ్లిసిటీ ఇచ్చుకొన్నా ఏం లాభం. ఇదంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరే.