English | Telugu

ఆ థియేట‌ర్ లో టికెట్టు వెల‌.. రూ.1000

త‌మిళ‌నాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్ ప‌ట్టిలో ష‌ణ్ముగ థియేట‌ర్ ఇప్పుడు వార్త‌ల్లో నిలిచింది. హాట్ టాపిక్‌గా మారింది. కార‌ణం ఏంటంటారా?? ఈ థియేట‌ర్ లో సినిమా చూడాలంటే రూ.1000 చ‌దివించుకోవాలి. అబ్బో... చాలా రేటు. అంత రేటు పెట్టి ఎవ‌రు చూస్తారు?? అనుకొంటున్నారా. అక్క‌డే ఉంది బంప‌ర్ ఆఫ‌ర్‌. ఒక్క‌సారి టికెట్లు కొంటే.. యేడాదంతా సినిమాలు చూడొచ్చు. ఎన్నిసార్ల‌యినా థియేట‌ర్ కి వెళ్లొచ్చు. మీకు ఖాళీ లేక‌పోతే.. ఆ టికెట్లు ఇంకొక‌రికి ఇచ్చి పంపొచ్చు. అంతేకాదు.. ఆ థియేట‌ర్‌లో ఉన్న షాపింగ్ మాల్‌లో ఏ వ‌స్తువు కొన్నా 5 శాతం డిస్కౌంట్ అందుకోవ‌చ్చు. బంగారం వ‌స్తువుల‌పైనా ఇది వ‌ర్తిస్తుంది. ఇంకేం.. ఆఫ‌ర్ అదిరిపోయింది క‌దూ. అందుకే జ‌నాలంతా టికెట్లు కొన‌డానికి ఎగ‌బ‌డ్డారు. ఇప్ప‌టికి రెండు వేల టికెట్లు అమ్ముడుపోయాయి. మ‌రో 8 వేల టికెట్లు అమ్మ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకొన్నార‌ట‌. అంతా బాగానే ఉంది. ఒక్క‌సారిగా ఆ ప‌దివేల మందీ సినిమా చూడ్డానికి వ‌స్తే.. థియేట‌ర్ వాళ్లు ఏం చేస్తారో..?? సంవ‌త్స‌ర‌మంతా ఒకే సినిమా ఆడిస్తే.. ప్రేక్ష‌కుల ప‌రిస్థితి ఏమిటో..?? దీని వెనుక ఏదో మ‌త‌ల‌బు ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది క‌దూ. మొత్తానికి ఈ ఆఫ‌ర్ అంద‌రికీ న‌చ్చింది. మ‌రి ఎలా ఇంప్లిమెంట్ చేస్తాడో చూడాలి.