English | Telugu

క‌లెక్ష‌న్ కింగ్‌కు మెగాస్టార్‌ ఫోన్‌! ప్ర‌కాశ్‌రాజ్‌తో సంబంధంలేద‌ని చెప్పిన చిరు!!

హాట్ హాట్ అట్మాస్పియ‌ర్‌లో ఇటీవ‌ల జ‌రిగిన‌ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎల‌క్ష‌న్స్‌లో ప్ర‌కాశ్‌రాజ్ ఓడిపోయి మంచు విష్ణు ప్రెసిడెంట్‌గా ఎన్నిక‌య్యాడు. టోట‌ల్ 26 మంది ఉండే కార్య‌వ‌ర్గంలో విష్ణు ప్యాన‌ల్ మెంబ‌ర్స్ 15 మంది గెలిచారు. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల్లో త‌మ ప్యాన‌ల్ నుంచి గెలిచిన 11 మందిచేత రాజీనాయాలు చేయించారు ప్ర‌కాశ్‌రాజ్‌. తాను స్వ‌యంగా 'మా' ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్న‌ట్లు కూడా ప్ర‌క‌టించారు.

ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌కాశ్‌రాజ్‌కు మెగాస్టార్ చిరంజీవి స‌పోర్ట్ చేశార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం. ఓపెన్‌గా ఆయ‌న ఎక్క‌డా చెప్ప‌క‌పోయినా, ఆయ‌న త‌మ్మ‌డు నాగ‌బాబు ఆ విష‌యాన్ని ఓపెన్‌గా చెప్పారు. ప్ర‌కాశ్‌రాజ్ తెలుగు న‌టుల కంటే చాలా ఉన్న‌త స్థాయిలో ఉన్న న‌టుడ‌ని పొగిడిన నాగబాబు, త‌న స‌పోర్ట్‌, త‌న అన్న‌య్య చిరంజీవి స‌పోర్ట్ ప్ర‌కాశ్‌రాజ్‌కు ఉంద‌ని చెప్పారు. అలాగే ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం ప్ర‌కాశ్‌రాజ్ వైపే ఉన్నార‌ని కూడా బ‌య‌ట‌ప‌డింది. ఇండిపెండెంట్‌గా జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ పోస్ట్‌కు నామినేష‌న్ వేసిన బండ్ల గ‌ణేశ్ చేత ఆ నామినేష‌న్‌ను విత్‌డ్రా చేయించారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ప్ర‌కాశ్‌రాజ్ ప్యాన‌ల్‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు అత‌ని చేత ప్ర‌క‌ట‌న కూడా ఇప్పించారు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌కాశ్‌రాజ్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు చిరంజీవికి త‌ల‌నొప్పిగా మారింద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. ఎల‌క్ష‌న్స్ జ‌రిగిన రోజు సీసీ టీవీ ఫుటేజ్ కావాల‌ని ఎల‌క్ష‌న్ ఆఫీస‌ర్‌కు లెట‌ర్ రాశారు ప్ర‌కాశ్‌రాజ్‌. దాన్ని త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేశారు. మోహ‌న్‌బాబు, న‌రేశ్ యాంటీ సోష‌ల్‌గా బిహేవ్ చేశార‌నీ, సీనియ‌ర్ న‌టుడు బెన‌ర్జీపై దౌర్జ‌న్యం చేశార‌నీ ఆయ‌న‌ ఆరోప‌ణ‌లు చేశారు. 'మా' ఎన్నిక‌ల్లో ఓట‌మిని జీర్ణించుకోక‌పోవ‌డం వ‌ల్లే ప్రకాశ్‌రాజ్ ఇలా బిహేవ్ చేస్తున్నార‌నే ఒపీనియ‌న్ అంద‌రిలోనూ ఏర్ప‌డింది. ప్ర‌కాశ్‌రాజ్‌ను సైలెంట్‌గా ఉండ‌మ‌ని చిరు చెప్పార‌నీ, అయినా విన‌కుండా త‌న ధోర‌ణి త‌న‌ది అన్న‌ట్లు ప్ర‌కాశ్‌రాజ్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నీ ఇన్‌సైడ‌ర్స్ అంటున్నారు.

ప్ర‌కాశ్‌రాజ్ ప్ర‌వ‌ర్త‌న‌తో విసిగిపోయిన చిరంజీవి.. ఆయ‌న వ‌ల్ల ఇండ‌స్ట్రీలో త‌న‌కు చెడ్డ‌పేరు వ‌స్తుంద‌ని భావించారు. అందుకే ఆదివారం మోహ‌న్‌బాబుకు ఆయ‌న ఫోన్ చేశార‌నీ, ఎల‌క్ష‌న్స్ త‌ర్వాత ప్ర‌కాశ్‌రాజ్, అత‌ని ప్యాన‌ల్ మెంబ‌ర్స్‌ ప్ర‌వ‌ర్తిస్తున్న తీరుతో త‌న‌కేమాత్రం సంబంధం లేద‌ని చెప్పిన‌ట్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఇందులో నిజ‌మెంత అనేది తెలియ‌క‌పోయినా, ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో ఈ ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఇటీవ‌ల తన కుమారుడు విష్ణుతో పాటు బాల‌కృష్ణ‌ను క‌లిసిన మోహ‌న్‌బాబు, త్వ‌ర‌లో చిరంజీవిని కూడా క‌లుస్తామ‌ని చెప్పారు. ఈలోగా మోహ‌న్‌బాబుకు చిరు ఫోన్ చేశార‌నే విష‌యం బ‌య‌ట‌కు పొక్కింది.