English | Telugu

వైష్ణ‌వ్ తోనే బుచ్చిబాబు నెక్స్ట్ ఫిల్మ్?

`ఉప్పెన‌`.. ఈ ఏడాది ఆరంభంలో బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ కురిపించిన చిత్రం. వైష్ణ‌వ్ తేజ్, కృతి శెట్టిని హీరోహీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించిన ఈ సినిమాతో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేశాడు. వైష్ణ‌వ్, కృతితో పాటు బుచ్చిబాబు సానాకి కూడా ఈ సినిమా డ్రీమ్ డెబ్యూ మూవీగా నిలిచింది.

ఇదిలా ఉంటే.. `ఉప్పెన‌` రిలీజ్ త‌రువాత‌ వైష్ణ‌వ్, కృతి ప‌లు ప్రాజెక్ట్స్ తో బిజీగా మార‌గా.. బుచ్చిబాబు మాత్రం ఇంకా రెండో సినిమాని ప‌ట్టాలెక్కించ‌నేలేదు. యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ తో బుచ్చిబాబు తన రెండో సినిమా చేయ‌బోతున్న‌ట్లు, స్పోర్ట్స్ డ్రామాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్క‌నుంద‌ని కొన్నాళ్ళ క్రితం ప్ర‌చారం సాగింది. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. త‌న తొలి చిత్ర క‌థానాయ‌కుడు వైష్ణ‌వ్ తేజ్ తోనే బుచ్చిబాబు సెకండ్ డైరెక్టోరియ‌ల్ వెంచ‌ర్ రూపొంద‌నుంద‌ట‌. అంతేకాదు.. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ‌నే ఈ సినిమాని కూడా నిర్మిస్తుంద‌ని టాక్.

తార‌క్ ప్ర‌స్తుతం `ఆర్ ఆర్ ఆర్`ని పూర్తిచేసే ప‌నిలో ఉన్నారు. ఆపై కొర‌టాల శివ కాంబినేష‌న్ లో ఓ సినిమా, ప్ర‌శాంత్ నీల్ కెప్టెన్సీలో మ‌రో చిత్రం చేయ‌బోతున్నారు. అవి పూర్త‌వ‌డానికి దాదాపు రెండేళ్ళ స‌మ‌యం ప‌డుతుంది. అందుకే.. ఈ లోపు వైష్ణ‌వ్ తేజ్ తో రెండో సినిమాని ప్లాన్ చేస్తున్నాడ‌ట బుచ్చిబాబు. త్వ‌ర‌లోనే వైష్ణ‌వ్ - బుచ్చిబాబు కాంబో మూవీపై క్లారిటీ రానుంది.